- లాకప్ డెత్ కేసు..
ప్రజాశక్తి-అమరావతి : గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో ప్రధాన నిందితుడు నాగరాజును రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులోనే విచారించాలని విజయవాడ రెండో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో సోమవారం వాదనలు ముగిశాయి. ఇరుపక్షాల వాదనలు విన్నాక జస్టిస్ కుంచం మహేశ్వరరావు ఉత్తర్వులను మంగళవారానికి వాయిదా వేశారు. ఈ కేసులో నాగరాజును పోలీసు కస్టడీకి ఇవ్వాలని సిట్ దాఖలు చేసిన పిటిషన్‌ను విజయవాడ కోర్టు అనుమతినిస్తూ ఈ నెల 10వ తేదీ వరకు పోలీసు కస్టడీకి అప్పగించింది. అయితే విచారణను రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులోనే నిర్వహించాలని, నిందితుడి న్యాయవాదికి హాజరయ్యే అవకాశం కల్పించాలని ఆదేశించింది. అంతేకాకుండా జైలు ప్రాంగణంలో సిసిటివి కెమెరాలు లేదా ఇతర వీడియో రికార్డింగ్ వ్యవస్థ ఉన్న ప్రాంతంలోనే విచారణ జరగాలని స్పష్టం చేసింది. ఈ ఆదేశాలు దర్యాప్తు స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తున్నాయని పేర్కొంటూ సిట్ హైకోర్టును ఆశ్రయించింది. సోమవారం జరిగిన విచారణలో సిట్ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ వాదనలు వినిపిస్తూ, నిందితుడిని ఎక్కడ విచారించాలన్నది పూర్తిగా దర్యాప్తు అధికారి నిర్ణయించే అంశమని, దీనిని సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసిందన్నారు. పోలీసు కస్టడీలో నిందితుడు ఇచ్చే సమాచారం ఆధారంగా భౌతిక ఆధారాలు సేకరించడం, నేర స్థలాన్ని పునర్నిర్మించడం వంటి చర్యలు చేపట్టాల్సి ఉంటుందని తెలిపారు. భద్రతపై ఆందోళన ఉంటే విచారణ ముగిసిన అనంతరం ప్రతిరోజూ నాగరాజును గుంటూరు జైలుకు తరలించే ఏర్పాట్లు చేస్తామని కోర్టుకు వివరించారు.








కామెంట్‌లు (0)