ప్రజాశక్తి - యంత్రాంగం : ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల దాఖలు, ఉపసంహరణల ప్రక్రియల నేపథ్యంలో రాష్ట్రంలోని పలు మున్సిపాల్టీలు ఆదివారం ఏకగ్రీవమయ్యాయి. ఉమ్మడి కడప జిల్లాలో రెండు మున్సిపాల్టీలు ఏక్రగీవమ య్యాయి. వైఎస్ఆర్ కడప జిల్లా ఎర్రగుంట్ల, అన్నమయ్య జిల్లా రాయచోటి మున్సిపాల్టీలను టిడిపి కూటమి గెలుచుకుంది. ఎర్రగుంట్ల మున్సిపాల్టీలో చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు ఎన్నికల అధికారి వద్ద డిక్లరేషన్ ఫారం తీసుకుని ఆదివారం బాధ్యతలు చేపట్టారు. మున్సిపల్ చైర్మన్‌గా బిజెపి అభ్యర్థి గొర్ల మధులత బాధ్యతలు స్వీకరించారు. రాయచోటి మున్సిపాల్టీలో చైర్మన్ స్థానంతో సహా 44 వార్డు కౌన్సిలర్ల స్థానాలను టిడిపి కూటమి గెలిచిందని ఎన్నికల అధికారులు ప్రకటించారు. 40 వార్డు స్థానాలను టిడిపి మద్దతు దారులు, 3 స్థానాల్లో బిజెపి, ఒక స్థానంలో జనసేన మద్దతుదారులు విజయం సాధించారు. ప్రకాశం జిల్లా దర్శి మున్సిపల్ చైర్మన్‌గా జనసేన అభ్యర్థి దారం సుబ్బారావుతో పాటు టిడిపికి చెందిన 25 మంది, జనసేన 2, బిజెపి ఒకరు.. మొత్తం 28 మంది కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు మున్సిపల్ కమిషనర్, ఎన్నికల అధికారి కె.అర్జునరావు డిక్లరేషన్ పత్రాలు ఆదివారం అందజేశారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మున్సిపాల్టీలో 24వ వార్డు టిడిపి అభ్యర్థి కాళ్ల జయదేవ్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అసిస్టెంట్ ఎన్నికల అధికారి ఎన్.రమేష్ ప్రకటించారు. మిగిలిన వారు నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో ఏకగ్రీవమైనట్లు తెలిపారు. పల్నాడు జిల్లాలో 3 మున్సిపాల్టీలకు చైర్మన్లు, కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. పిడుగురాళ్ల చైర్మన్‌గా షేక్ ఖాలేషా వలి, దాచేపల్లి నుంచి తంగెళ్ల శ్రీనివాసరావు, గురజాల నుంచి నేలవల్లి బొల్లయ్య టిడిపి నుంచి ఏకగ్రీవంగా గెలుపొందారు. మార్కాపురం జిల్లా కనిగిరి పురపాలక సంఘం చైర్‌పర్సన్‌గా టిడిపి అభ్యర్థి అచ్చాల తిరుపతమ్మ ఎన్నికయ్యారు. నగర పురపాలక సంఘం పరిధిలోని మొత్తం 32 వార్డులకు నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియ పూర్తయిన అనంతరం 30 వార్డుల్లో ఒక్కో నామినేషన్ మిగిలిందని, 27 టిడిపి, 1 బిజెపి, 2 జనసేన ఏకగ్రీవమైనట్లు కమిషనర్, అసిస్టెంట్ ఎన్నికల అధికారి పి.శ్రీధర్ తెలిపారు. కుప్పం మున్సిపాల్టీలోని 32 వార్డులకు గానూ 13 వార్డులు టిడిపితో ఏకగ్రీవమయ్యాయి. చిత్తూరు జిల్లా నగరి మున్సిపాల్టీలో 40 వార్డులకు గానూ 4 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. చిత్తూరు నగరపాలక సంస్థలోని 60 డివిజన్లలో టిడిపి కూటమి 50, వైసిపి 1 ఏకగ్రీవమయ్యాయి. తిరుపతి నగరంలో 66 డివిజన్లకు గానూ 46వ డివిజన్ కార్పొరేటర్‌గా విజయ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చిత్తూరు జిల్లాలో నాలుగు జడ్పిటిసిలు ఏకగ్రీవమయ్యాయి. ఏర్పేడు జడ్పిటిసి ఏకగ్రీవమైంది. స్థానిక సంస్థల ఎన్నికలలో యాదమరి, సదుం, బంగారు పాళ్యం మండలాల్లో జడ్పిటిసి స్థానానికి వైసిపి తరఫున నామినేషన్ వేయలేదు. దీంతో, అధికార పక్షం టిడిపి జడ్పిటిసి అభ్యర్థులు ఏకగ్రీవం అయినట్లే. పూతలపట్టులో వైసిపి తరఫున జడ్పిటిసి నామినేషన్ దాఖలు చేశారు. శనివారం జరిగిన నామినేషన్ల పరిశీలనలో సరైన పత్రాలు లేవంటూ అధికారులు ఆ నామినేషన్ దరఖాస్తులను తిరస్కరించారు. పూతలపట్టులో టిడిపి జెడ్‌పిటిసి అభ్యర్థిగా శైలజ తేజోమూర్తి, బిఎస్‌పి, జనసేన పోటీ పడుతున్నారు.
Print Editionపలు మున్సిపాల్టీలు ఏకగ్రీవం
59 నిమిషాల క్రితం
వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 25, 2026, 11:12 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)