ప్రధాన కార్యాలయం తరలింపుపై ఉత్తర్వులు
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు ప్రధాన కార్యాలయాన్ని కాకినాడ నుంచి అమరావతికి తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం కాకినాడలో ఉన్న ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు, రాష్ట్ర పోర్టుల డైరెక్టరేట్ కార్యాలయాన్ని సిబ్బంది, రికార్డులు, ఆస్తులు, ఇతర అవసరమైన మౌలిక సదుపాయాల సహా అమరావతికి మార్చాలని ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, ఇతర విభాగాధిపతులతో సమన్వయం చేసుకుంటూ అన్ని అభివృద్ధి కార్యక్రమాలు అమరావతి నుంచే నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. అలాగే మారిటైమ్ బోర్డు ప్రధాన కార్యాలయ సిబ్బంది జీతభత్యాల చెల్లింపులను ఇకపై కాకినాడ జిల్లా ట్రెజరీకి బదులుగా మంగళగిరిలోని పే అండ్ అకౌంట్స్ కారాలయం ద్వారా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వాస్తవానికి కాకినాడ నుంచి మారీటైం బోర్డును గతంలోనే విశాఖపట్నానికి తరలిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఇప్పటివరకు ఈ నిర్ణయం అమలుకు నోచుకోలేదు. మారీబోర్డు సీఈవో మాత్రం కాకినాడ నుంచే విధులు నిర్వహించారు. ఇప్పుడు అమరావతి నుంచే విధులు నిర్వహించాలని, అమరావతినే ప్రధాన కేంద్రంగా ఖాతాకు చేయాలని నిర్ణయించడం విశేషం.









కామెంట్‌లు (0)