శనివారం, 01 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

హిందూత్వ గ్రూపుల బరితెగింపు!

2 గంటల క్రితం

protest
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 02, 2026, 12:06 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- మహిళా ఆందోళనకారులే లక్ష్యంగా ఆన్‌‌లైన్‌ వేధింపులు

- కేంద్రం హామీకి భిన్నంగా 15 ఏళ్ల బాలికపై కేసు

- యువతులను లక్ష్యంగా చేసుకుంటున్నారన్న సిజెపి

న్యూఢిల్లీ : నీట్‌ ‌పేపర్‌ ‌లీకేజీలపై ఇటీవల ఢిల్లీలో జరిగిన కాక్రోచ్‌‌ జనతా పార్టీ (సిజెపి) ఆందోళనల్లో పాల్గొన్న యువతులు, బాలికలను లక్ష్యంగా చేసుకుని వారిపై ఆన్‌‌లైన్‌లో వేధింపులకు పాల్పడుతున్నారు. పైగా వారికి సంబంధించిన ప్రైవేట్‌ ‌సమాచారాన్ని, వారి గుర్తింపును బహిరంగపరుస్తూ, అత్యాచారం చేస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బెదిరిస్తున్నారు. ప్రధానంగా బిజెపి, హిందూత్వ సైద్ధాంతిక భావజాలాన్ని ప్రచారం చేసే గ్రూపులు, సంస్థలు ఈ దారుణాలకు తెగబడుతున్నాయి. అసభ్య పదజాలాన్ని వాడారన్న సాకుతో ఆందోళనకారుల ఫోటోలు, వారికి సంబంధించిన వీడియోలను వైరల్‌ ‌చేస్తూ వారి పేర్లను, అడ్రస్‌‌లను, పనిచేసే ప్రదేశాలు లేదా చదువుకునే కాలేజీల పేర్లు చెప్పాలంటూ కోరుతున్నారు. వారికి గుణపాఠం చెప్పాలి అంటూ డిమాండ్‌ ‌చేస్తున్నారు. వారిని కనిపెట్టండి అంటూ ది జైపూర్‌ ‌డైలాగ్స్‌ సహా అనేక హిందూత్వ హ్యాండిల్స్‌ ప్రకటనలు జారీ చేస్తున్నాయి. ఆ యువతుల అడ్రస్‌‌లు కనిపెట్టినవారికి బహుమతులను కూడా ప్రకటిస్తున్నారు. ఈ యువతులకు సంబంధించిన ఎఐ చిత్రాలు, వీడియోలు కూడా హల్‌‌చల్‌ అవుతున్నాయి.

కేంద్రం హామీకి భిన్నంగా 15 ఏళ్ల బాలికపై కేసు

విద్యార్ధులపై ఎలాంటి కేసులు పెట్టబోమని సిజెపికి కేంద్ర ప్రభుత్వం హామీకి భిన్నంగా ప్రధాని మోడీపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసారంటూ 15ఏళ్ళ బాలికపై జీరో ఎఫ్‌ఐఆర్‌ ‌నమోదు చేసిన సంఘటన చోటు చేసుకుంది. సుప్రీం కోర్టు న్యాయవాది స్మృతి సింగ్‌ ‌చాందెల్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకే ఆ నొయిడా బాలికపై కేసు నమోదు చేశారు. ఈ స్మృతి సింగ్‌ ‌హిందూత్వ గ్రూపు అయిన అఖండ్‌ ‌భారత్‌ ‌హిందూ సేనకు జాతీయ స్థాయిలో లీగల్‌‌హెడ్‌‌గా పనిచేస్తున్నారు. మరి కొంతమందికి లీగల్‌‌ నోటీసులు కూడా జారీ అయినట్లు తెలుస్తోంది. దీనిపై సిజెపి ప్రతినిధి రత్నాసింగ్‌ ‌మాట్లాడుతూ, ఈ విషయాలన్నీ సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళామని, వారు హామీలైతే ఇస్తున్నారు కానీ అవి కార్యరూపం దాల్చడం లేదని వ్యాఖ్యానించారు. నొయిడా బాలికకు అవసరమైన న్యాయసాయం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. తనపై కూడా ఆన్‌‌లైన్‌‌లో తీవ్రంగా వేధింపులు ఎదురవుతున్నాయన్నారు.

బిజెపి మద్దతుదారుల దూషణలపై చర్యలేవీ?

దేశవ్యాప్తంగా బిజెపి నేతలు పార్లమెంట్‌ ‌నుండి వీధి స్థాయి వరకు ఎక్కడబడితే అక్కడ యథేచ్ఛగా అసభ్యకర వ్యాఖ్యలు, దూషణలకు దిగడం దేశ ప్రజలందరూ చూస్తూనే వున్నారు. చివరకు వార్తా చానెళ్ళలో చర్చల సమయంలో కూడా వదిలిపెట్టడం లేదు. కానీ వారిపై ఎలాంటి న్యాయపరమైన చర్యలు, పర్యవసానాలు లేవు. రేపిస్ట్‌‌లకు, హంతకులకు మెడల్లో దండలు వేసి మరీ గౌరవించిన బిజెపి నేతలు కూడా వున్నారు. కొత్తగా విద్యా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్‌ ‌జోషి బిల్కినో బానో అత్యాచార కేసులో దోషులను ముందుగానే విడిచిపెట్టడాన్ని సమర్ధించారు. ఏం జరిగిందో అది చట్టప్రకారమే జరిగిందంటూ వ్యాఖ్యలు కూడా చేశారు.

యువతులను లక్ష్యంగా చేసుకుంటున్నారు : సిజెపి

యువతులు బహిరంగంగా తమ అభిప్రాయాలు వెల్లడించినా, లేదా తమ అసంతృప్తిని, అసమ్మతిని వ్యక్తం చేసినా వారిని ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకుంటున్నారని సిజెపి ప్రతినిధి రత్నాసింగ్‌ ‌విమర్శించారు. బిజెపి ఎంపి కంగనా రనౌత్‌ నిరసన తెలుపుతున్న యువతులను ఉద్దేశించి ‘ఇలాంటి వారు మంచి గృహిణులు కాలేరు. వీరు తాగడం, మాదకద్రవ్యాలు తీసుకోవడాన్ని కూడా సోషల్‌ ‌మీడియాలో ప్రదర్శిస్తారు. ఎవరు వీరిని కన్నది, పెంచింది’ అంటూ విపరీత వ్యాఖ్యలు చేశారు.

ఇక్కడ ఒకరిద్దరు యువతుల అసభ్య విమర్శలపై అక్కసు కంటే 12ఏళ్ళుగా మోడీ ప్రభుత్వంపై గోడీ మీడియా పెంచి పోషించుకుంటూ వచ్చిన ప్రతిష్ట అంతా దెబ్బతింటోందన్నదే ప్రధానంగా వుందని విశ్లేషకులు విమర్శిస్తున్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్