శనివారం, 01 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

పశ్చిమాసియా వీడండి

2 గంటల క్రితం

trump
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 02, 2026, 12:00 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- అమెరికా పౌరులకు దౌత్య కార్యాలయాల విజ్ఞప్తి

- ఇరాన్‌‌పై భీకర దాడులు చేస్తాం : ట్రంప్‌

- హర్మూజ్‌ జలసంధిలో మరో రెండు ట్యాంకర్లపై దాడి

వాషింగ్టన్/టెహ్రాన్: అమెరికా - ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరమవుతున్న నేపథ్యంలో పశ్చిమాసియాలోని అమెరికా రాయబార కార్యాలయాలు తమ దేశ పౌరులను ఆ ప్రాంతం విడిచి వెళ్లాలని హెచ్చరించాయి. ఇరాన్‌‌పై భీకర దాడులు చేస్తామని ట్రంప్‌ ‌ప్రకటించిన అనంతరం అమెరికా ఈ అడ్వైజరీ జారీ చేయడం గమనార్హం. అదివారం నుండి ఇరాన్‌‌లోని అణువిద్యుత్‌ ‌కేంద్రాలు, విద్యుత్‌ ‌ప్లాంటులు, వంతెనలు లక్ష్యంగా దాడులు చేసేందుకు అగ్రరాజ్యం యోచిస్తోందని అంతర్జాతీయ మీడియా నివేదించింది. శుక్రవారం ఇరాన్‌పై అమెరికా ఎలాంటి దాడులు చేపట్టలేదు. ఇరాన్ పారామిలిటరీ దళం రివల్యూషనరీ గార్డ్, హర్మూజ్‌ జలసంధిలో మరో రెండు చమురు ట్యాంకర్లపై దాడి చేసినట్లు ప్రకటించింది. తమ భూభాగంలోకి చొచ్చుకొచ్చిన డ్రోన్లను అడ్డుకున్నట్లు కువైట్ తెలిపింది.

​ఇరాన్‌‌ను దెబ్బతీస్తాం : ట్రంప్‌

శనివారం నాడు క్యాంప్ డేవిడ్ అధ్యక్షన జరిగిన క్యాబినెట్ సమావేశం సందర్భంగా విలేకరులతో ట్రంప్‌ మాట్లాడారు. ఇరాన్‌పై సుదీర్ఘ సైనిక చర్యకు అమెరికా సిద్ధంగా ఉందంటూ ట్రంప్ సంకేతమిచ్చారు. ఇరాన్‌ ‌భరించలేనంత గట్టిగా దెబ్బతీస్తామని తెలిపారు. ఇరాన్‌‌పై నమ్మకం సన్నగిల్లుతోందని, హామీలను ఉల్లంఘిస్తుందంటూ ట్రంప్‌ చెప్పుకొచ్చారు. అయితే చర్చలూ కొనసాగుతాయన్నారు. చర్చల బృందంలో స్టీవ్ విట్‌కాఫ్, సీనియర్ సలహాదారు జేర్డ్ కుష్నర్, ఉపాధ్యక్షుడు జెడి వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో వంటి కీలక వ్యక్తులున్నారని ఆయన తెలిపారు. తాము గెలుస్తామని మీడియాకు చెప్పుకొచ్చారు. అయితే, శ్వేత సౌథ కార్యదర్శి కరోలిన్‌ ‌లీవిట్‌ ‌ఇరాన్‌ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తుందని విమర్శించారు. "ఇరాన్ అమెరికాతో అవగాహన ఒప్పందంపై సంతకం చేసి, ఆ తర్వాత దానిని ఉల్లంఘించి, వాణిజ్య నౌకలపై కాల్పులు జరిపి, అమెరికన్ సైనికులను చంపింది," అని లీవిట్ అన్నారు. అధ్యక్షుడు ట్రంప్ వాళ్లకి అర్థమయ్యే సమాధానమిస్తారని చెప్పారు.

​ అమెరికాయే ఉద్రిక్తతలు పెంచుతోంది : ఇరాన్

పశ్చిమాసియాలో అమెరికా ఉద్రిక్తతలు తీవ్రతరం చేస్తోందని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ తెలిపారు. యుద్ధాన్ని ఎదుర్కొంటున్న ఇరాన్ ప్రజలను వీరులుగా కొనియాడారు. నిరంతరం యుద్ధ శత్రువులను ఎదుర్కొన్నప్పటికీ, ఇరాన్ భవిష్యత్తును ఇరాన్ ప్రజలే నిర్ణయిస్తారని పెజెష్కియాన్ సోషల్‌ ‌మీడియాలో తెలిపారు. ఇరాన్ సైనిక కేంద్ర కమాండ్ చీఫ్ అలీ అబ్దుల్లాహి మాట్లాడుతూ, అమెరికా ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలను వేగంగా పెంచుతోందని, ‘‘నేరపూరిత, దురాక్రమణ అమెరికాకు రక్షణ కవచంగా వ్యవహరించే ఏ దేశమైనా యుద్ధ జ్వాలల్లో చిక్కుకుంటుంద’’ని ఆయన పేర్కొన్నారు. తమపై దాడులు చేసేందుకు అమెరికాకు సైనిక స్థావరాల వినియోగానికి అనుమతించవద్దని బ్రిటన్‌ను ఇరాన్‌ హెచ్చరించింది. అలా చేస్తే అది దురాక్రమణ చర్యగా పరిగణించి, తాము ఆత్మరక్షణా చర్యలు చేపడతామని ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చీ స్పష్టం చేశారు.

భీకర దాడులకు అమెరికా సిద్ధమవుతున్న వేళ, ఆ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఇరాన్ సన్నద్దమవుతుంది. అత్యంత దుర్భర పరిస్థితులను ఎదుర్కొనేందుకు వచ్చే రెండేళ్లకు సరిపడా నిత్యావసర వస్తువుల సరఫరాలను సిద్ధం చేస్తున్నట్లు ఇరాన్ ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ మొహమ్మద్ రెజా ఆరెఫ్ శనివారం అధికార మీడియాకు తెలిపారు. ప్రజలకు మౌలిక వసతుల కల్పనే తమ ప్రధాన లక్ష్యమని, ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని ఆయన తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్