శనివారం, 01 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

వరద గోదావరి..

1 గంట క్రితం

floods
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 02, 2026, 12:28 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

- భద్రాచలం వద్ద మూడో, ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరికలు జారీ

- లోతట్టు గ్రామాల్లోకి నీరు

- సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్న ప్రజలు

- బిక్కుబిక్కుమంటున్న లంకవాసులు

- నిలిచిన అంతర్రాష్ట్ర్ర 
బస్ సర్వీసులు

ప్రజాశక్తి- యంత్రాంగం : ఎగువున కురుస్తున్న వర్షాలు, పైన రిజర్వాయర్ల నుంచి విడుదలవుతున్న నీటితో గోదావరికి వరద ఉధృతి కొనసాగుతోంది. భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. ఇక్కడ శనివారం రాత్రి తొమ్మిది గంటలకు 55 అడుగుల మేర నీటిమట్టం నమోదైంది. పోలవరం స్పిల్ వే వద్ద 33.5 మీటర్ల నీటిమట్టాన్ని స్థిరంగా ఉంచి ఇక్కడ నుంచి దిగువకు 14.87 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ధవళేశ్వరంలోని కాటన్ బ్యారేజీ వద్ద 13.90 అడుగుల నీటిమట్టం నమోదవడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఈ బ్యారేజీ 175 గేట్లను పైకిలేపి 13,07,821 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. కాటన్ బ్యారేజీ నుంచి దిగువకు పెద్ద మొత్తం వరద జలాలను విడుదల చేస్తుండటంతో డాక్టర్ బిఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను వరద నీరు తాకింది. గోదావరికి వరద పోటెత్తడంతో సఖినేటిపల్లి, నరసాపురం మధ్య పంటు ప్రయాణాలను అధికారులు నిలిపివేయడంతో రాకపోకలు నిలిచిపోయాయి. పెద్ద మొత్తంలో వరద రావడంతో పోలవరం జిల్లాలోని విఆర్.పురం, కూనవరం, చింతూరు, ఎటపాకల్లో పలు గ్రామాలు జల దిగ్బంధనంలో చిక్కుకున్నాయి. రహదారులపైకి వరద నీరు చేరడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి ఎగపోటు కారణంగా చింతూరు వద్ద శబరి నది 36 అడుగుల నీటిమట్టానికి చేరి ప్రవహిస్తోంది. ఈ మండలంలో సోకిలేరు వాగు కూడా ఉధృతికి సుమారు 50 గ్రామాలకు చింతూరు మండల కేంద్రంతో సంబంధాలు తెగిపోయాయి. కూనవరం గ్రామంలోకి వరద నీరు ప్రవేశించింది. శబరి, గోదావరి నదుల సంగమ ప్రదేశం వద్ద ప్రవాహం ఉధృతంగా ఉండడంతో విఆర్‌.పురం మండలంలోని లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి.​ ​గోదావరి పరివాహక ప్రాంతాలైన వడ్డిగూడెం, శ్రీరామగిరి, సీతంపేట, జీడిగుప్పలతో పాటు శబరి పరివాహక ప్రాంతాలైన అడవివెంకన్నగూడెం, చింతరేగుపల్లి, కన్నాయిగూడెం గ్రామాల రహదారులపైకి భారీగా వరద నీరు చేరింది. దీంతో, ఆయా గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. వరద నీటిలోనే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు, గుట్టలపైకి తరలివెళ్తున్నారు. వడ్డిగూడెం ప్రజలు తమ సామగ్రిని రేఖపల్లి మైదాన ప్రాంతానికి తీసుకెళ్తున్నారు. అక్కడ తాత్కాలిక గుడారాలు వేసుకున్నారు. ఉదయభాస్కర్ కాలనీ వాసులను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కూనవరం, టేకులబోరు గ్రామాల ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఇళ్లను అద్దెకు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. వరద తాకిడికి ఎటపాకలోని పలు ప్రభుత్వ కార్యాలయాలు నీటమునిగాయి. దేవీపట్నం మండలంలో గోదావరి ఒడ్డున ఉండే గండి పోచమ్మ తల్లి ఆలయ గోపురం మాత్రమే కనిపిస్తోంది. పాపికొండలకు వెళ్లే బోటు సర్వీసులు ఆగిపోయాయి. కూనవరం మండలంలో మురుమూరు వద్ద రోడ్డుపైకి వరద రావడంతో భద్రాచలానికి రాకపోకలు, ఎటపాక వద్ద జాతీయ రహదారి 30పై వరద నీరు ప్రవహిస్తుండడంతో అంతర్రాష్ట్ర్ర బస్సు సర్వీసులు నిల్చిపోయాయి.

బాధితులకు సిపిఎం పరామర్శ

విఆర్.పురం మండలంలోని వరద ప్రభావిత ప్రాంతాలకు సిపిఎం నాయకులు పడవలపై వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. ఆ పార్టీ ఎంపిపి కారం లక్ష్మి వరద బాధితుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం వారిని ఆదుకోవాలని కోరారు. ​పట్టించుకోని ప్రభుత్వం వరద ప్రభావిత ప్రాంతాలకు అధికారులు వచ్చి మైదాన ప్రాంతాలకు వెళ్లాలని చెబుతున్నారు తప్ప, సరైన సాయం అందించడం లేదని వరద బాధితులు వాపోతున్నారు. పునరావాస కేంద్రాలను సిద్ధం చేయలేదని, అక్కడ నివసించడానికి ఎలాంటి వసతులూ లేవని పలువురు చెబుతున్నారు. కనీసం గుడారాలు వేసుకోవడానికి టార్ఫాలిన్లు, బియ్యం, ఇతర నిత్యావసరాలు కూడా ఇవ్వడం లేదని ఆవేదన చెందుతున్నారు.

ఏలూరు జిల్లాలో ​44 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలింపు

ఏలూరు జిల్లా కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని పలు 30.00గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. గోదావరి మరింత పెరిగితే గ్రామాల్లోకి వరద వస్తుందనే భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. ప్రస్తుతం ఎనిమిది వేల మందిపై వరద ప్రభావం పడింది. ముందస్తు చర్యల్లో భాగంగా 15 బోట్లు, రెండు లాంచీలను అధికారులు సిద్ధం చేశారు. ఇప్పటి వరకూ రెండు మండలాల పరిధిలో రెండు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి 44 కుటుంబాలను తరలించినట్లు అధికారులు తెలిపారు. కుక్కునూరు మండలం గొమ్ముగూడెం గ్రామానికి చెందిన 150 కుటుంబాలు రావికుంట పునరావాస కాలనీకి, వేలేరుపాడు మండలం రాపాకగొమ్మిలో 500 కుటుంబాలకుగాను ఇప్పటి వరకూ 300 కుటుంబాలు చల్లావారిగూడెం కాలనీకి తరలివెళ్లాయి.

సురక్షిత ప్రాంతానికి వెళ్తుండగా గుండెపోటుతో యువకుడు మృతి

వరద నేపథ్యంలో ఇంటి సామాన్లను సురక్షిత ప్రాంతానికి తరలిస్తుండగా విఆర్‌‌.పురం మండలం శ్రీరామగిరికి చెందిన నాళ్లరపు నవీన్ (32) గుండెపోటుతో కుప్పకూలారు. స్థానికులు, బంధువులు వెంటనే నాటు పడవలో రేఖపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో, ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నవీన్ కు భార్య, ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం రూ.20 లక్షల నష్టపరిహారం ప్రకటించాలని సిపిఎం డిమాండ్‌ ‌చేసింది.




ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్