మంగళవారం, 14 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionదద్దరిల్లిన కలెక్టరేట్లు

3 గంటల క్రితం

mlc
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 14, 2026, 11:45 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

  • సమస్యల పరిష్కారానికి ఫ్యాప్టో ఆధ్వర్యాన ఉపాధ్యాయులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన పికెటింగ్

  • భీమవరం, మచిలీపట్నంలో ఉద్రిక్తత

ప్రజాశక్తి- యంత్రాంగం : తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఉపాధ్యాయులు, ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం పెద్ద ఎత్తున ఉద్యమించారు. భారీ ర్యాలీలు, కలెక్టరేట్ల వద్ద పికెటింగ్ లు నిర్వహించారు. ఫ్యాప్టో ఆధ్వర్యాన ఈ కార్యక్రమం చేపట్టారు. పిఆర్‌‌సిని వెంటనే ప్రకటించాలని, అప్పటి వరకూ 30 శాతం ఇంటీరిమ్ రిలీఫ్ (ఐఆర్) మంజూరు చేయాలని, పెండింగ్‌లో ఉన్న ఐదు డిఎలను వెంటనే విడుదల చేయాలని, సిపిఎస్‌ రద్దు చేసి ఒపిఎస్‌ను అమలు చేయాలని, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పికెటింగ్ అనంతరం అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. భీమవరంలో పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకోవడం, మచిలీపట్నంలో అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.

పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు పాత బస్టాండ్ నుంచి కలెక్టరేట్ కు చేపట్టిన భారీ మోటర్ సైకిల్ ర్యాలీని ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి, ఫ్యాప్టో రాష్ట్ర చైర్మన్ ఎల్.సాయిశ్రీనివాస్ ప్రారంభించారు. ప్రకాశం చౌక్, పోలీస్ బొమ్మసెంటర్, కొత్త బస్టాండ్ రోడ్డు, ఓవర్ బ్రిడ్జి మీదుగా కలెక్టరేట్ వరకు ర్యాలీ సాగింది. కలెక్టరేట్ గేటు వద్ద పిడిఎఫ్ ఎమ్మెల్సీ గోపిమూర్తి, ఫ్యాప్టో నేతలు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు బైఠాయించి పికెటింగ్‌ ‌చేశారు. కలెక్టరేట్ ఉద్యోగులను లోపలికి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో జాయింట్ కలెక్టర్ కల్పశ్రీ కారులో కలెక్టరేట్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా వారు అడ్డుకున్నారు. డిఆర్‌ఒ పి.ప్రభాకర్, వన్ టౌన్ ఎస్ఐ కిరణ్... జెసి వాహనాన్ని లోపలకి వెళ్లనీయాలని ఫ్యాప్టో నేతలను అడిగారు. కొద్ది సమయంలో నిరసన పూర్తవుతుందని, అప్పటివరకు సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో భీమవరం వన్ టౌన్ సిఐ రమేష్, ఎస్ఐ కిరణ్ వెంటనే ఇక్కడి నుంచి ఖాళీ చేయాలని, లేకపోతే అరెస్టు చేస్తామని హెచ్చరించారు. తాము ఇక్కడి నుంచి కదిలేది లేదని వారు తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులను, ఉద్యోగులను పోలీసులు దుర్భాషలాడారు. సిఐ రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో, గోపిమూర్తి, సాయి శ్రీనివాస్, ఫ్యాప్టో నేతలు మాట్లాడుతూ కొద్ది సమయంలో నిరసన ముగిస్తామని సిఐ రమేష్‌‌తో చెప్పినా ఇక్కడి నుంచి వెంటనే ఖాళీ చేయాలని ఆదేశించడంతో వాగ్వివాదం, తోపులాట చోటుచేసుకుంది. సాయి శ్రీనివాస్, ఫ్యాప్టో జిల్లా చైర్మన్ పిఎస్.విజయరామరాజు, ఇతర నేతలు ఎంవి.రాజశేఖర్, రాంజీ అంబేద్కర్‌‌లను పోలీసులు లాక్కెళ్లి అదుపులోకి తీసుకున్నారు. యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.క్రాంతిబాబును రోడ్డుపై ఈడ్చుకుంటూ తీసుకెళ్లి పోలీస్ వాహనం ఎక్కించారు. పిడిఎఫ్ ఎమ్మెల్సీ గోపిమూర్తిపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఆయనను కాళ్లు, చేతులు పట్టుకుని ఈడ్చుకెళ్తుండగా గోపిమూర్తికి వలయంగా మహిళా ఉపాధ్యాయులు నేలపై బైఠాయించారు. ఈ నేపథ్యంలో భీమవరం డిఎస్పి రఘువీర్‌ విష్ణు అక్కడకు చేరుకున్నారు. ఫ్యా‌ప్టో నేతలతో డిఎస్‌‌పి, సిఐ మాట్లాడారు. అదుపులోకి తీసుకున్న నేతలను విడుదల చేశారు. దీంతో, ఆందోళన విరమించారు.

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో భారీ ర్యాలీ అనంతరం కలెక్టరేట్ వద్ద పికెటింగ్ నిర్వహించారు. ర్యాలీగా బయలుదేరిన ఉపాధ్యాయులను పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి అడ్డుకోవడంతో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. కొద్దిమంది నాయకులను మాత్రమే డిఆర్ఒకు వినతిపత్రం ఇచ్చేందుకు

కలెక్టరేట్ లోకి అనుమతించారు.

ఎన్టిఆర్ జిల్లా విజయవాడలోని ధర్నా చౌక్ లో నిరసన కార్యక్రమంలో ఫ్యాప్టో డిప్యూటీ సెక్రటరీ జనరల్ ఎన్. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరో బిఆర్టిఎస్ ఉద్యమానికి సిద్ధమవుతారని హెచ్చరించారు.

ఏలూరులో జిల్లా పరిషత్తు కార్యాలయం నుంచి కలెక్టరేట్‌ ‌వరకూ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఎపి జెఎసి కో-చైర్మన్‌ ‌ఎన్.రామారావు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం కలెక్టరేట్ వద్ద పికెటింగ్ నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్ వద్ద ఉదయం తొమ్మిది గంటల నుంచే ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ధర్నాకు దిగారు. కలెక్టరేట్ ఉద్యోగులను లోనికి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. రెండు గంటలపాటు ధర్నా అనంతరం పోలీసుల నచ్చచెప్పడంతో విరమించారు. అనంతరం డిఆర్ఒకు వినతిప్రతం అందించారు.

గుంటూరు కలెక్టరేట్‌ ‌వద్ద ఉపాధ్యాయులు పికెటింగ్‌ ‌నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్యాప్టో రాష్ట్ర డిప్యూటీ సెక్రటరీ జనరల్ కె.బసవలింగారావు మాట్లాడుతూ ఉపాధ్యాయ, ఉద్యోగ సమస్యల పట్ల ప్రభుత్వ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

​ నెల్లూరులో విఆర్ సి గ్రౌండ్ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్యాప్టో రాష్ట్ర కో-చైర్మన్ చిట్టేటి రమేష్ ప్రసంగించారు. తిరుపతిలో కలెక్టరేట్ వద్ద జరిగిన పికెటింగ్ లో మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి మాట్లాడుతూ ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలని, ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలు చేయాలని, కారుణ్య నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఫ్యాప్టో సెక్రటరీ జనరల్ ఎస్.చిరంజీవి, రాష్ట్ర బిటిఎ ట్రెజరర్ రఘునాథ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. ​ర్యాలీగా వచ్చి విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, కడప, అన్నమయ్య, చిత్తూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కాకినాడ, అమలాపురం, నరసరావుపేటకలెక్టరేట్ల వద్ద పికెటింగ్ చేశారు. అనకాపల్లి, అల్లూరి జిల్లా పాడేరుల్లో ర్యాలీ, ధర్నా నిర్వహించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్