- మరింత వేగంగా పీఎం సూర్యఘర్ కనెక్షన్లు
- సమీక్షలో సిఎం చంద్రబాబు నాయుడు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఎల్‌నినో ప్రభావంతో దేశ వ్యాప్తంగా ధరల పెరుగుదల కన్పిస్తోందని... ఆ ప్రభావం నిత్యవసరాలపై పడకుండా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో ఆర్టీజీఎస్ సమీక్షలో భాగంగా వివిధ శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. బియ్యం, కందిపప్పు, ఉల్లి, వంటనూనె, పంచదార వంటి నిత్యవసరాల ధరలు పెరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతుబజార్లలో ప్రభుత్వం తరఫున అందిస్తున్న బియ్యం అమ్మకాలపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని.. కొనుగోళ్లు బాగా జరుగుతున్నాయని అధికారులు సిఎంకు వివరించారు. అలాగే దీపావళీ, సంక్రాంతి వంటి పండుగల సమయంలోను రైతు బజార్లల్లో తక్కువ ధరకు నాణ్యమైన బియ్యాన్ని అందుబటులో ఉంచే అంశాన్ని పరిశీలించాలన్నారు. అలాగే ఉల్లిపాయల సరఫరాను మరింత పెంచి, సామాన్యులకు ఎలాంటి ఇబ్బందీ కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో విద్యుత్ సరఫరాకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆటంకం కలగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. పిఎం సూర్యఘర్ కింద ఇళ్లపై సోలార్ ప్యానెళ్ల ఏర్పాటులో మరింత పురోగతి సాధించాలని, ప్రస్తుతం జాతీయ స్థాయిలో 4వ స్థానంలో ఉన్నామని, దీన్ని మరింత మెరుగుపరుచుకోవాలన్నారు. లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఇంకా తొమ్మిది లక్షల కనెక్షన్లను ఏర్పాటు చేయాలని, వీటిని వీలైనంత త్వరగా ఏర్పాటు చేసేలా కార్యాచరణ అమలు చేయాలని సూచించారు. ఇసుక సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పాలనలో టెక్నాలజీని పూర్తిగా ఉపయోగించుకుని ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే తక్షణమే సరిదిద్దుకోవాలని పేర్కొన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం మరింత మెరుగ్గా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ సమీక్షలో సిఎస్ సాయి ప్రసాద్ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)