- వైభవంగా పుస్తకావిష్కరణ సభ
ప్రజాశక్తి-ఎన్టీఆర్ జిల్లా ప్రతినిధి : స్థానిక బుక్ ఫెస్టివల్ సొసైటీ హాల్లోని కామ్రేడ్ చలసాని ప్రసాదరావు సభా ప్రాంగణంలో ‘అణువు’ లఘు కవితల అంతర్జాల సింగిల్ పేజీ మాసపత్రిక, ‘నిజాలు’ (అంతర్జాతీయ కామ్రేడ్ కవుల సూక్తులు) పుస్తకాల ఆవిష్కరణ సభ వైభవంగా నిర్వహించారు. ప్రముఖ సాహితీవేత్తలు, విమర్శకులు హాజరైన ఈ సభలో మినీ కవిత్వ వైశిష్ట్యం, డిజిటల్ విప్లవం, సాహిత్య రంగంపై సాంకేతికత (ఎఐ) ప్రభావంపై విస్తృత చర్చ జరిపారు. సభకు అధ్యక్షత వహించిన ప్రజాసాహితి ప్రతినిధి కొత్తపల్లి రవిబాబు మాట్లాడుతూ, గతంలో తిరుపతికి చెందిన మార్క్సిస్ట్ మేధావుల కొటేషన్ల పుస్తకాన్ని సింగంపల్లి అశోక్ కుమార్ నవీకరించి, తన శైలిలో 4 లైన్ల మినీ కవితలను, మేధావుల జీవిత విశేషాలను జోడించి 40 పేజీల అద్భుత గ్రంథంగా తీర్చిదిద్దారని కొనియాడారు. తదుపరి ముద్రణలో దీనిని పాకెట్ సైజులో తెస్తే పాఠకులకు మరింత సులభంగా ఉంటుందని ఆకాంక్షించారు. ప్రముఖ రచయిత రావి రంగారావు మాట్లాడుతూ, 2024 జనవరి నుండి వాట్సాప్, ఫేస్బుక్ వేదికలుగా అశోక్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన మూడు నెలల కవిత్వ వర్క్‌షాప్ గైడెన్స్‌ను పుస్తక రూపంలోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. ‘నానీలు’ వంటి ప్రక్రియల్లో అక్షరాల నిబంధనల వల్ల కవిత్వ బలం దెబ్బతింటుందని, ఛందస్సు సంకెళ్లు లేని మినీ కవిత్వానికే భావ స్వేచ్ఛ ఎక్కువని స్పష్టం చేశారు. 2010 తర్వాత తగ్గిన మినీ కవితల సంకలనాల జోరును మళ్లీ పుంజుకునేలా చేయాలని పిలుపునిచ్చారు. సాహితీవేత్త పూర్ణచంద్ మాట్లాడుతూ, 1960ల నుండి తాము మినీ కవితను ఒక ఉద్యమంగా నడిపామని గుర్తుచేసుకున్నారు. భవిష్యత్తు అంతా వెబ్ (డిజిటల్) పత్రికలదేనని, తాను కూడా పెన్ను, కాగితం లేకుండా 70కి పైగా డిజిటల్ పుస్తకాలు రాశానని తెలిపారు. ‘అణువు’ అంతర్జాల మాసపత్రిక భవిష్యత్తులో మరిన్ని పేజీలతో వారపత్రికగా విస్తరించాలని ఆకాంక్షించారు. నండూరి రాజగోపాల్ మాట్లాడుతూ సాహిత్య రంగంలో పెరుగుతున్న సాంకేతికత వినియోగంపై స్పందించారు. ప్రస్తుతం కొందరు చాట్ జీపీటీ వంటి ఏఐ టూల్స్ ద్వారా దొంగ సాహిత్యాన్ని, గజల్స్, కవితలను సృష్టించి వేదికలపై చదువుతున్నారని, అటువంటి వాటిని సులభంగా కనిపెట్టవచ్చని హెచ్చరించారు. సాంకేతికతను సృజనాత్మకతకు తోడుగా వాడుకోవాలే తప్ప దానికి బానిస కాకూడదని హితవు పలికారు. నేటి తరం చేతుల్లో ఫోన్లు ఉన్నందున ప్రపంచ విషయాలు తెలుస్తున్నాయని, అయితే కేవలం ‘ప్రేక్షకులను’ కాకుండా నిజమైన ‘సాహిత్య పాఠకులను’ పెంచే వాతావరణాన్ని సృష్టించాల్సిన అవసరం ఉందని వక్తలు నొక్కి చెప్పారు. 2005 నుండి ‘చినుకు’ పత్రిక ద్వారా అశోక్ కుమార్ చేసిన సాహిత్య కృషి, లబ్దప్రతిష్ఠులైన రచయితలతో రాయించిన విధానం ఎందరికో ఆదర్శమని కొనియాడారు. అణువు సంపాదకులు సింగంపల్లి అశోక్ కుమార్ మాట్లాడుతూ... సాహిత్య ప్రక్రియలలో కవిత్వం అంటే చాలా ఇష్టం, అందునా ముఖ్యంగా మినీ కవిత్వం అంటే మరీ ఇష్టం అని తెలిపారు. మినీ కవిత్వాన్ని రాయడమే కాకుండా, ప్రచారం చేయడంలోనూ, పత్రికను నడపడంలో ప్రముఖుల (బాలగోపాల్ గారు వంటి వారి) సహకారం, ప్రోత్సాహం ఎంతో లభించాయని గుర్తుచేసుకున్నారు. తన మొదటి మినీ కవిత్వ పుస్తకాన్ని, తాను ఎవరో తెలియకపోయినా ఎంతో అద్భుతమైన ప్రశంసలతో పది వేదికల మీద పరిచయం చేశారని చెప్పారు. ఈ పత్రికకు చందా (సబ్స్క్రిప్షన్ ఫీజు) ఏమీ ఉండదని, కవులు పంపే కవిత్వమే దీనికి చందా అని వివరించారు. పత్రికలో ప్రచురితమైన కవితలన్నింటినీ కలిపి ప్రతి నెల చివరలో ఒక ఈ-బుక్ రూపంలో అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సాహిత్య కార్యక్రమాలు మరియు పత్రిక ఎంతో విజయవంతంగా నడుస్తున్నాయని, భవిష్యత్తులో కూడా ఇలాగే విజయవంతంగా ముందుకుసాగుతుందనే నమ్మకాన్ని వ్యక్తపరిచారు. ఈ సభలో జానసాహితి గౌరవ అధ్యక్షులు దివికుమార్, అరసం అధ్యక్షులు పర్చూరి అజయ్ కుమార్, విరసం అధ్యక్షులు అరసవిల్లి కృష్ణ, సాహితి స్రవంతి అధ్యక్షులు సత్యజీ పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పలువురు కవులు, రచయితలు, పుస్తక ప్రేమికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.







కామెంట్లు (0)