శుక్రవారం, 06 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ పనులను పరిశీలించిన మంత్రి

1 గంట క్రితం

ravi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 06, 2026, 05:19 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పర్యటన

- మూడు రాష్ట్రాల సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు

సంతనూతలపాడు: తుపాను ప్రభావంతో దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థ పునరుద్ధరణ పనులను విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పరిశీలించారు. సతనూతలపాడు నియోజకవర్గంలోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే విజయ్ కుమార్‌తో కలిసి ఆయన పర్యటించారు. తుపాను కారణంగా దెబ్బతిన్న విద్యుత్ స్తంభాలు, లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్లను పరిశీలించి, పునరుద్ధరణ పనుల పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యుత్ సిబ్బంది నిడమానూరు, నాగులుప్పలపాడు ప్రాంతాల్లో చేస్తున్న పనులను మంత్రి పరిశీలించారు. సిబ్బందితో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన సిబ్బందికి నాణ్యమైన భోజనం, వసతి సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ పునరుద్ధరణ కోసం సహకరిస్తున్న మూడు రాష్ట్రాల ప్రభుత్వాలకు, సిబ్బందికి ఆంధ్రప్రదేశ్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడి సుమారు 3 వేల మందికి పైగా విద్యుత్ సిబ్బందిని రాష్ట్రానికి రప్పించారని మంత్రి తెలిపారు. రెండు తుపానుల కారణంగా విద్యుత్ శాఖకు రూ.500 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని వెల్లడించారు. గోదావరి జిల్లాల్లో గురువారం సాయంత్రానికే పూర్తిస్థాయిలో విద్యుత్ పునరుద్ధరణ చేపట్టామని, మిగిలిన ప్రాంతాల్లో కూడా వేగంగా పనులు జరుగుతున్నాయని చెప్పారు. శుక్రవారం సాయంత్రానికి 70 శాతం పునరుద్ధరణ పనులు పూర్తి చేస్తామని, శనివారం సాయంత్రానికి విద్యుత్ సరఫరాను పూర్తిస్థాయిలో పునరుద్ధరించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. విడతల వారీగా తొలుత గృహ వినియోగదారులకు, అనంతరం వ్యవసాయ రంగానికి, ఆక్వా రంగానికి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని పేర్కొన్నారు. తుపాను కారణంగా అనేక ప్రాంతాల్లో విద్యుత్ కండక్టర్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు (డీటీఆర్‌లు), 7,500కు పైగా విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయని వివరించారు. సంతనూతలపాడు, అద్దంకి, ఒంగోలు పరిసర ప్రాంతాల్లో పొగాకు పంట కూడా భారీగా దెబ్బతిందని మంత్రి తెలిపారు. ఇప్పటికే అధికారులు ప్రాథమిక నష్టం అంచనాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు నివేదిక అందజేశారని వెల్లడించారు. విద్యుత్ పునరుద్ధరణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి ప్రజలకు, రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్