- చిన్నారి కోసం కొనసాగుతున్న గాలింపు
ప్రజాశక్తి - తుని (కాకినాడ జిల్లా): కాకినాడ జిల్లా తుని రూరల్ హెచ్.అగ్రహారంలో చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై రెండు వారాలైనా నేటికీ ఆచూకీ దొరకలేదు. ఈ నెల ఆరున పామాయిల్ తోటలో అదృశ్యమైన చిన్నారి కోసం గాలింపు కొనసాగుతోంది. పోలీసులు, అటవీశాఖ సిబ్బందితో పాటూ ఎస్.డిఆర్ఎఫ్, ఎన్.డిఆర్ఎఫ్ బృందాలు పామాయిల్ తోటతో పాటు పరిసర అటవీ ప్రాంతాలనూ జల్లెడ పడుతున్నాయి. శుక్రవారం చిన్నారి తల్లిదండ్రులను రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ వేటుకూరి సూర్యనారాయణ రాజు పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. జ్ఞానేశ్వరిని క్షేమంగా తల్లిదండ్రుల వద్దకు చేర్చేందుకు ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటుందన్నారు. చిన్నారి ఆచూకీ కోసం చేపట్టిన గాలింపు, దర్యాప్తుపై కమిషన్ ఎప్పటికప్పుడు ఆరా తీస్తోందని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర బలగాలు చిన్నారి ఆచూకీ కోసం అన్ని ప్రయత్నాలూ చేస్తున్నాయన్నారు.









కామెంట్‌లు (0)