ఆదివారం, 29 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

‘అధికార’ బెదిరింపులు

12 గంటల క్రితం

sad
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 28, 2026, 10:15 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- ఆర్‌ఒ సహకరించలేదని ఎమ్మెల్యే వార్నింగ్‌

- శెట్టూరులోని యాటకల్లులో బయటపడ్డ బ్యాలెట్‌ ‌పత్రాలు

ప్రజాశక్తి- అనంతపురం ప్రతినిధి : మొదటి విడత పంచాయతీ ఎన్నికలు పూర్తయినప్పటికీ అధికారులకు బెదిరింపులు తప్పడం లేదు. ఎన్నికల్లో సహకరించలేదంటూ... ఆర్‌ఒగా పనిచేసిన కాంతరాజుకు ఫొన్‌ ‌చేసి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే కాంతరాజు బూతులు తిట్టిన ఆడియో లీ‌కైంది. ఇది సోషల్‌ మీడియాలో శుక్రవారం రాత్రి నుంచి వైరల్‌ అయింది. అనంతపురం జిల్లా ​కళ్యాణదుర్గం నియోజకవర్గం కంబదూరు మండలం తిమ్మాపురం పంచాయతీ ఎన్నికల కౌంటింగ్‌‌లో వైసిపి మద్దతుదారుడు రేణుక 29 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. టిడిపి మద్దతుదారుడిగా బరిలో ఉన్న రోజా రీకౌంటింగ్‌‌ అడిగినట్టు సమాచారం. అందుకు రిటర్నింగ్‌ అధికారి కాంతరాజు అంగీకరించకుండా ఫలితాలు వెల్లడించినట్టు తెలుస్తోంది. దీనిపై కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబుకు రోజా ఫిర్యాదు చేశారు. దీంతో, ఆర్‌ఒ కాంతరాజుకు ఎమ్మెల్యే ఫోన్‌ ‌చేసి బెదిరించారు. ‘నీ ఇంటికి వస్తాను అడ్రసు పెట్టు. నీ భార్య పిల్లల ముందే మాట్లాడాలి. ఓడిపోయిన అభ్యర్థి రోజా ఏమైనా చేసుకుంటే నిన్ను ఎత్తుకెళ్లి నరికేస్తాను’ అంటూ వార్నింగ్‌ ఇస్తున్న ఆడియో బయటకు వచ్చింది.

ఆయన బెదిరించలేదు... ఎఐలో సృష్టించారు : రోజా, టిడిపి మద్దతు అభ్యర్థి

తిమ్మాపురం టిడిపి మద్దతు అభ్యర్థి రోజా శనివారం నాడు అనంతపురం నగరంలో మీడియా సమావేశం నిర్వహించారు. తాము రీకౌంటింగ్‌ కోరినా ఏకపక్షంగా ఆర్‌ఒ డిక్లరేషన్‌ ఇచ్చారని ఆమె ఆరోపించారు. ఎమ్మెల్యే సురేంద్రబాబు ఎవరినీ బెదిరించలేదని, అది ఎఐలో సృష్టించి పెట్టారని చెప్పారు.

ఎమ్మెల్యే అమిలినేనిపై కేసు నమోదు చేయాలి : సిఐటియు

ఎమ్మెల్యే అమిలినేనిపై కేసు నమోదు చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్రకుమార్‌ ‌ఒక ప్రకటనలో డిమాండ్‌‌ చేశారు. రిటర్నింగ్‌ అధికారైన ఉపాధ్యాయుడు కాంతరాజును చంపుతామని బెదిరించడాన్ని ఆయన ఖండించారు. ఏదైనా సమస్యలుంటే చట్టపరంగా వ్యవహరించాలి కానీ, ఈ రకంగా ఫోన్‌ ‌చేసి బెదిరించడం సరైంది కాదన్నారు. తక్షణం ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయాలని, ఉద్యోగి అయిన కాంతరాజుకు పోలీసు రక్షణ కల్పించాలని డిమాండ్‌ ‌చేశారు.

​ కళ్యాదుర్గం నియోజకవర్గంలో బ్యాలెట్‌ ‌పత్రాల కలకలం

కళ్యాణదుర్గం నియోజకవర్గం శెట్టూరు మండలం యాటకల్లు గ్రామంలో పోలైన ఓట్లు లభించడం కలకలం రేపుతోంది. జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలోని బెంచిలో వైసిసి మద్దతుదారుడిగా ఉన్న వరలక్ష్మి కత్తెర గుర్తుకు ఓటు పడిన 160 ఓట్లు లభించాయి. కౌంటింగ్‌ ‌సమయంలో ఇవి దాచిపెట్టి 125 ఓట్ల మెజార్టీతో టిడిపి మద్దతుదారుడు గెలిచినట్టుగా అధికారులు ప్రకటించారని వైసిపి మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. మరోమారు రీకౌంటింగ్‌‌ జరిపి తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్‌ ‌చేస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్