శనివారం, 25 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

వరి సాగు వద్దు

2 గంటల క్రితం

cm cbn
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 26, 2026, 12:00 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- ఆగస్టు నుంచి 'సంజీవని`

- ఆరోగ్యాంధ్రపదేశ్ లక్ష్యం

- సిలిండర్ తో లింక్ లేకుండా ఖాతాలోకి డబ్బులు

- ముఖ్యమంత్రి చంద్రబాబు

ప్రజాశక్తి- కర్నూలు ప్రతినిధి : ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో రాష్ట్రంలోని రైతులు వరి పంట సాగు చేయొద్దని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. ఆరోగ్యాంధ్రపదేశ్ లక్ష్యంగా పని చేస్తామన్నారు. గ్యాస్ సిలిండర్ తో లింక్ లేకుండా దీపం-2 డబ్బులు ఖాతాలో జమ చేస్తామని ప్రకటించారు. శనివారం ఆయన కర్నూలు జిల్లా ఆస్పరిలో సంజీవని పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ ఆగస్టు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సంజీవని పథకాన్ని అమలు చేస్తామని తెలిపారు. అనారోగ్యం పాలైతే వైద్యం కోసం భూములు అమ్ముకుంటున్నారని, పేదల ప్రాణాలు కాపాడే బాధ్యత తీసుకుంటామని తెలిపారు. అనారోగ్య సమస్యలకు కారణాలు ప్రాంతాల వారీగా గుర్తించే వ్యవస్థ తీసుకొస్తామని, నివారణ చర్యలు చేపడతామన్నారు. 'మీ ఆరోగ్యం కంప్యూటర్ లో ఉంటుంది. ఆధార్ నెంబర్ తో మెడికల్ రికార్డులు వస్తాయి. పిహెచ్ సి నుంచి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి వరకు నెట్ వర్క్ వస్తుంది. జబ్బుకు తగిన చికిత్స ఇంటికే తీసుకొస్తాం` అని వివరించారు. కిచెన్ ను ఫార్మసీగా, తిండినే మెడిసిన్ గా చేసు కుంటే ఆస్పత్రికి వెళ్లాల్సిన పని లేదన్నారు. గ్రామాల వారీగా ఆరోగ్యానికి ర్యాంకులు ఇస్తామని తెలిపారు.

ఎల్ నినో తో వర్షాలు లేవు... ప్రాజెక్టులకు నీళ్లు రాలేదు

ఎల్ నినో ప్రభావంతో వాతావరణ సమతుల్యత దెబ్బతినడంతో వర్షాలు పడడం లేదని, ప్రాజెక్టులకు నీళ్లు రాలేదని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. వరి వేయొద్దని, ఉండే నీటిని సమర్థవంతంగా ఉపయోగించుకుందామని, భూగర్భ జలాలు ఉంటే మెట్ట పంటలు వేయాలని సూచించారు. కరువొచ్చినా, సమస్యలొచ్చినా సమస్యను అధిగమిద్దామన్నారు. 'వేదవతి ప్రాజెక్టును నేనే ప్రారంభించాను. నేనే పూర్తి చేసి నీళ్లిస్తాను. హంద్రీనీవా ద్వారా నీళ్లు లిఫ్ట్ చేసి వేదవతిని నింపుతాను. నగరడోన కూడా పూర్తి చేస్తాను` అని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.

ఆర్థిక అసమానతలు తగ్గించడానికే పి-4

ఆర్థిక అసమానతలు తగ్గించడానికి పి-4 కింద ఆదుకొనే బాధ్యత తీసుకున్నామని చంద్రబాబు తెలిపారు. పేదల జీవితాల్లో వెలుగులు వచ్చే వరకూ అండగా ఉంటామన్నారు. గత ప్రభుత్వం అనేక తప్పుడు పనులు చేసిందని, మాటవినని వారి భూములను 22ఎ లో పెట్టిందని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాక సర్వే చేసి బ్లాక్ చైన్ టెక్నాలజీతో భూ రికార్డులు భద్రపరుస్తున్నామని, మార్చి నాటికి ఆ ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. అంతకుముందు డ్వాక్రా సంఘాల వ్యాపార మహిళలకు రూ.197.89 కోట్ల మెగా చెక్ ను ముఖ్యమంత్రి అందించారు. బహిరంగ సభ అనంతరం ఆస్పరి పిహెచ్ సిని చంద్రబాబు సందర్శించి సంజీవని పథకాన్ని ప్రారంభించారు. వైద్య సిబ్బంది, రోగులతో మాట్లాడారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్