- పిల్లలకు విషమిచ్చి తానూ తాగిన తల్లి
- కుమారుడు మృతి
- తల్లీ కుమార్తె పరిస్థితి విషమం
ప్రజాశక్తి - ఎచ్చెర్ల : సూర్యోదయం వేళ ఆ ఇంట్లో పెను విషాదం అలముకుంది. ముక్కపచ్చలారని పసి పిల్లల నవ్వులతో కళకళలాడాల్సిన ఆ ఇళ్లు మూగబోయింది. ఆ తల్లికి ఏం కష్టం వచ్చిందో గానీ కఠిన నిర్ణయం తీసుకుంది. గోరుముద్దులు తినిపించాల్సిన చేతులతో గడ్డి మందు తాగించింది. అనంతరం తానూ తాగింది. చిలకపాలెంలో మంగళవారం చోటుచేసుకున్న ఈ విషాద ఘటనలో ఏడు నెలల కుమారుడు కులదీప్ మృతి చెందగా... రెండున్నరేళ్ల కుమార్తె గాయత్రి, తల్లి మీన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కుటుంబసభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... హిరమండలం మండలంలోని కొండరాగోలు గ్రామానికి చెందిన తోనంగి మీన (25)కు మూడేళ్ల కిందట ఎచ్చెర్ల మండలం చిలకపాలెం గ్రామానికి చెందిన తోనంగి జగదీష్‌తో వివాహమైంది. జగదీష్ లారీ నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరికి కుమార్తె గాయత్రి, కుమారుడు కులదీప్ ఉన్నారు. జగదీష్ తల్లిదండ్రులు తవుడమ్మ, పైడయ్య... అన్నయ్య సురేష్‌తో కలిసి ఉమ్మడి జీవనం సాగిస్తున్నారు. మూడంతస్తుల ఇంట్లో జగదీష్ కింద, పైన ఇంట్లో సురేష్, తల్లిదండ్రులు నివసిస్తున్నారు. సోమవారం రాత్రి జగదీష్ లారీ నడిపేందుకు వెళ్లగా, ఇంట్లో మీన ఇద్దరు పిల్లలు పడుకున్నారు. మీన కొంతకాలంగా తీవ్ర మానసిక సమస్యలతో బాధపడుతోంది. ఈనేపథ్యంలోనే మంగళవారం వేకువజామున వ్యవసాయ పనుల కోసం తెచ్చి ఇంట్లో ఉంచిన గడ్డిమందును ఇద్దరు పిల్లలకు పాలలో కలిపి తాగించి, ఆతర్వాత ఆమె కూడా తాగింది. కాసేపటి తర్వాత మీన ఇంటి నుంచి బయటకు వచ్చి వాంతులు చేసుకుంటుండగా, తోటికోడలు దగ్గరకు వచ్చి చూసేసరికి గడ్డిమందు వాసన గుర్తించింది. ఇంట్లోకి వెళ్లి చూసేసరికి పిల్లలు మంచంపై స్పృహ లేకుండా పడి ఉండడంతో కుటుంబసభ్యులు, స్థానికులను పిలిచింది. హుటాహుటిన వారిని శ్రీకాకుళం సర్వజనాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో కులదీప్ మృతి చెందాడు. మీన, కుమార్తె గాయత్రి చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉంది. మీన తల్లి అమ్మాయమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ జి.లక్ష్మణరావు తెలిపారు.








కామెంట్‌లు (0)