ఆదివారం, 20 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నంద్యాలను కరువు జిల్లాగా ప్రకటించాలి

46 నిమిషాల క్రితం

gadi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 21, 2026, 12:41 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు కె.లోకనాథం డిమాండ్‌

- నేడు కలెక్టరేట్‌ ఎదుట ధర్నా విజయవంతానికి పిలుపు

ప్రజాశక్తి - గడివేముల : నంద్యాలను కరువు జిల్లాగా ప్రకటించి, రైతులను ఆదుకునేందుకు రూ.500 కోట్ల ప్రత్యేక నిధులు విడుదల చేయాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు కె.లోకనాథం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కరువు పరిస్థితులపై ప్రభుత్వం స్పందించాలని కోరుతూ సోమవారం జిల్లా కలెక్టరేట్‌ ఎదుట నిర్వహించనున్న ధర్నాకు రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు. ఆదివారం నంద్యాల జిల్లా నంద్యాల మండలం రైతునగరం, పాండురంగపురం గ్రామాలు, గడివేముల, కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలాల్లో వర్షాభావంతో ఎండిపోయిన పంటలను ఎపి రైతు, కౌలు రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులతో కలిసి కె.లోకనాథం, నంద్యాల జిల్లా కార్యదర్శి టి.రమేష్‌ కుమార్‌ పరిశీలించారు. పంట నష్టపోయిన రైతులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం గడివేముల సిపిఎం కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ‌లోకనాథం మాట్లాడారు. గత రెండేళ్లుగా అతివృష్టి, అనావృష్టితో జిల్లాలో పంట దిగుబడులు తగ్గుతున్నాయని తెలిపారు. జిల్లాలో సాధారణ వర్షపాతం 724.9 మిల్లీ మీటర్లు కాగా, ఈ ఏడాది సాధారణం కంటే 53 శాతం తక్కువగా నమోదైందన్నారు. సాధారణ ఖరీఫ్‌ సాగు విస్తీర్ణం 5,50,575 ఎకరాలు కాగా ఎల్‌‌నినో ప్రభావంతో 3,16,325 ఎకరాలు సాగైందని, అందులో 70 శాతం పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. మొక్కజొన్న, పత్తి, సోయాబీన్‌, మిరప, వరి పంటలు పూర్తిగా ఎండిపోయాయని, ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు అమలు కావాలంటే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. నంద్యాలను కరువుగా జిల్లా ప్రకటించాలని, కరువు సహాయక చర్యలు తక్షణం చేపట్టాలని, రైతులు, కౌలు రైతుల రుణాలను రద్దు చేయాలని, ప్రతి రైతుకు ఉచిత పంటల బీమా అమలు చేసి పరిహారం చెల్లించాలని కోరారు. కౌలు రైతులు చెల్లించిన ముందస్తు కౌలు డబ్బులు ప్రభుత్వమే తిరిగి ఇప్పించాలని, దేవాలయ భూములకు ముందస్తు కౌలు చెల్లించిన వారికి ఒక సంవత్సరం అదనంగా కౌలు గడువు పెంచాలని, ప్రభుత్వ పథకాలు కౌలు రైతులకు వర్తింప చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రజలకు, పశువులకు తాగు నీటి కొరత లేకుండా చూడాలని, అన్ని గ్రామాల్లో కార్మికులకు, ప్రజలందరికీ ఉపాధి పనులు కల్పించాలని, వేతనం రూ. 600 ఇవ్వాలని, పేదలందరికీ కరువు కూపన్లు పంపిణీ చేసి ఉచితంగా బియ్యం, నిత్యవసర వస్తువులు సరఫరా చేయాలని డిమాండ్‌ చేశారు. రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు, ప్రజలు రాజకీయాలకు అతీతంగా సోమవారం కలెక్టరేట్‌ ఎదుట జరిగే ధర్నాలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి టి.రామచంద్రుడు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి నరసింహ నాయక్, సిపిఎం జిల్లా నాయకులు లక్ష్మణ్, బాలవెంకట్, సిఐటియు నంద్యాల పట్టణ కార్యదర్శి పి.వెంకటలింగం, ప్రజా సంఘాల నాయకులు సురేష్, శ్రీనివాస రెడ్డి, కృష్ణ, రైతులు, వ్యవసాయ కార్మికులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్