ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు, పాఠశాల విద్యాశాఖ కార్యాలయాల్లోని ఇతర సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం నూతన సర్వీస్ రూల్స్‌ను ప్రకటించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ మంగళవారం ఉత్తర్వులు విడుదల చేసింది. కొత్త నిబంధనలు అక్టోబర్ 2, 2026 నుంచి అమల్లోకి వచ్చినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. 2025 రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా ఉపాధ్యాయుల నియామకాలు, పదోన్నతులు, బదిలీలు, సీనియారిటీ తదితర అంశాల్లో మార్పులు తీసుకొచ్చింది. ఇకపై క్లాస్-1, క్లాస్-2 కేటగిరీల్లోని పోస్టులకు సంబంధిత రెవెన్యూ జిల్లానే నియామక యూనిట్‌గా ఉంటుందని స్పష్టం చేసింది. ప్రత్యక్ష నియామకాలలో స్థానిక అభ్యర్థులకు 95 శాతం రిజర్వేషన్ కల్పించనున్నారు. స్కూల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీలో సబ్జెక్టును బట్టి 30 శాతం లేదా 70 శాతం ప్రత్యక్ష నియామకాలు, మిగిలిన పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేసే విధానాన్ని నిర్దేశించింది. ఉపాధ్యాయుల రేషనలైజేషన్‌లో మిగులుగా గుర్తించిన వారిని అవసరమైన సబ్జెక్టులకు సర్దుబాటు చేసేందుకు ప్రత్యేక నిబంధనలు రూపొందించారు. అర్హులైన ఉపాధ్యాయుల నుంచి ముందుగా సమ్మతి తీసుకునే అవకాశం కల్పించింది. అవసరమైన పరిస్థితుల్లో నిబంధనల ప్రకారం తాత్కాలిక బదిలీలు కూడా చేపట్టవచ్చంది. పదోన్నతులు, బదిలీ ద్వారా నియామకాలకు కింది కేటగిరీలో కనీసం రెండేళ్ల సర్వీస్ తప్పనిసరి చేసింది. ప్రత్యక్ష నియామకాలకు రెండేళ్ల ప్రొబేషన్, పదోన్నతి ద్వారా నియమితులైన వారికి ఏడాది ప్రొబేషన్‌ను నిర్దేశించింది. సంబంధిత ఉపాధ్యాయ పోస్టులకు విద్యార్హతలతో పాటు టెట్/సిటిఇటి అర్హత తప్పనిసరి అని పేర్కొంది. ప్రత్యేక విద్య ఉపాధ్యాయులకు ఆర్‌సిఐ గుర్తింపు, చెల్లుబాటు అయ్యే సిఆర్ఆర్ నంబర్ ఉండాలంది, ఎయిడెడ్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లోకి విలీనమైన ఉపాధ్యాయుల సీనియారిటీని ప్రభుత్వ పాఠశాలలో విధుల్లో చేరిన తేదీ ఆధారంగా నిర్ణయించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. గతంలో 2009లో జారీ చేసిన సర్వీస్ రూల్స్ స్థానంలో ఈ నూతన తాత్కాలిక నిబంధనలను తీసుకొచినట్లు వెల్లడించింది.
Print Editionప్రభుత్వ ఉపాధ్యాయులకు కొత్త సర్వీస్ రూల్స్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 03, 2026, 10:42 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)