- నవంబర్ 29కి పరీక్ష వాయిదా
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ప్రస్తుత విద్యా సంవత్సరానికి నిర్వహించనున్న నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ (ఎన్‌ఎంఎంఎస్) పరీక్ష దరఖాస్తు గడువును ఈ నెల 27 వరకు పొడిగించినట్లు ప్రభుత్వ పరీక్షల సంచాలకులు జె.వి. శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. గతంలో నవంబర్ 15న నిర్వహించనున్నట్లు ప్రకటించిన పరీక్షను 29కి వాయిదా వేసినట్లు సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, ఎయిడెడ్, మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలు, వసతి సౌకర్యం లేని ఎపి ఆదర్శ పాఠశాలల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్షకు రాసేందుకు అర్హులన్నారు. ఏడో తరగతిలో కనీసం 55 శాతం మార్కులు సాధించి ఉండాలని, ఎస్సి, ఎస్టి విద్యార్థులకు 50 శాతం మార్కులు సరిపోతాయని తెలిపారు. కుటుంబ వార్షిక ఆదాయం రూ.3.50 లక్షల లోపు ఉండాలన్నారు. పరీక్ష ఫీజు ఒసి, బిసి విద్యార్థులకు రూ.100, ఎస్సి, ఎస్టి విద్యార్థులకు రూ.50గా నిర్ణయించారు. ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించాలన్నారు. ప్రింటెడ్ నామినల్ రోల్, ఒరిజినల్ ఎస్‌బిఐ కలెక్ట్ రసీదును ఈ నెల 28లోగా సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. దరఖాస్తుల ధ్రువీకరణకు అక్టోబర్ 29 చివరి తేదీగా నిర్ణయించారని తెలిపారు. విద్యార్థులు దరఖాస్తులో తమ పేరు, తండ్రి పేరును ఆధార్ కార్డులో ఉన్న విధంగానే నమోదు చేయాలని అధికారులు సూచించారు. దరఖాస్తు సమయంలో ధ్రువపత్రాలు అవసరం లేకపోయినా, పరీక్ష సమయానికి వాటిని సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు. అర్హులైన విద్యార్థులు www.bse.ap.gov.in వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, మరిన్ని వివరాల కోసం సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయాన్ని సంప్రదించాలని ప్రభుత్వ పరీక్షల సంచాలకులు సూచించారు.







కామెంట్‌లు (0)