పిటిషన్ తిరస్కరించిన సుప్రీంకోర్టు
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : తిరుమల కల్తీ నెయ్యి (లడ్డూ) వ్యవహారానికి సంబంధించిన కేసు విచారణను ఆంధ్రప్రదేశ్ నుంచి పొరుగు రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. విచారణను మరో రాష్ట్రానికి మార్చాల్సినంత బలమైన కారణాలు లేవని పేర్కొంది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చితో కూడిన ధర్మాసనం గురువారం ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మహారాష్ట్రకు చెందిన డెయిరీ వ్యాపారవేత్త, మల్గంగా మిల్క్ అండ్ ఆగ్రో ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మచీంద్ర శాంతారాం లంకే విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఆయన తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ దేవ్ వాదనలు వినిపించారు. ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఈ కేసుపై నిరంతరం రాజకీయ వ్యాఖ్యలు చేస్తున్నారని, దీంతో నిష్పక్షపాత విచారణ జరిగే వాతావరణం లేదన్నారు. నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు ఫోరెన్సిక్ నివేదిక నిర్ధారించలేదని చెబుతున్నప్పటికీ రాజకీయ నాయకులు ఈ అంశంపై వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ వాదనలపై స్పందించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్.. గతంలోనే ఈ అంశంపై తగిన ఆదేశాలు జారీ చేశామని వ్యాఖ్యానించారు. ‘మా ఆదేశాలతో వారందరినీ మౌనం పాటించేలా చేశాం. ఏదైనా జరిగితే మళ్లీ మా వద్దకు రావచ్చు’ అని పేర్కొన్నారు.








కామెంట్‌లు (0)