- గిరిజన సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శికి వినతి
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఆంధ్ర - ఒడిశా రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న సరిహద్దు వివాదం పేరుతో గిరిజనులపై ఒడిశా పోలీసుల దాడులను ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. గిరిజనులపై దాడులను అరికట్టి, సరిహద్దు ప్రాంత గిరిజనులకు రక్షణ కల్పించాలని కోరుతూ ఆదివాసీ గిరిజన సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం నాయకులు.. రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ ప్రభుత్వ కార్యదర్శి డి మురళీధర్ రెడ్డికి సోమవారం వినతిపత్రం అందజేశారు. దాదాపు 90 ఏళ్లుగా కొనసాగుతున్న అంతర్రాష్ట్ర సరిహద్దు వివాదాన్ని పరిష్కరించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని, ఆ వివాదానికి గిరిజన ప్రజలను బలిపశువులుగా చేయడం దారుణమని ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎ అశోక్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె లోకనాథం కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర కార్యదర్శి అండ్ర మాల్యాద్రి పేర్కొన్నారు. ఒడిశా పోలీసులు గ్రామాల్లోకి ప్రవేశించి గిరిజనులను భయభ్రాంతులకు గురిచేయడం, అక్రమంగా నిర్బంధించడం, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను బలవంతంగా నామినేషన్లు ఉపసంహరించుకునేలా చేయడం ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న పంచాయితీ ఎన్నికల సందర్భంగా నామినేషన్ వేసిన వ్యక్తుల్ని సాలూరు ప్రాంతంలో లిబిరి, ఎస్.బీసు ఇద్దరినీ అరెస్ట్ చేసి కొరాపుట్ జైల్లో పెట్టి నాలుగు రోజులు అవుతుందన్నారు. రాజు, బిత్రు, డోచు, పితృ నలుగురిని పోలీసులు అదుపులో తీసుకొని చిత్రహింసలు పెడుతున్నారన్నారు. ఎన్నికల్లోనూ గిరిజనులు పాల్గొనకుండా అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. కొటియా ప్రాంతంలోని గంజాయి భద్ర, పట్టు చెన్నూరు, పగులు చెన్నూరు గ్రామాలకు చెందిన పది మందిని ఒడిశా పోలీసులు అదుపులోకి తీసుకొని, వారిలో ఇద్దరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్టు చేసినట్లు వినతిపత్రంలో వివరించారు.








కామెంట్లు (0)