బుధవారం, 14 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

గిరిజన భూములపై అధికారుల దౌర్జన్యం

02 అక్టోబర్, 2026

గిరిజన భూములపై అధికారుల దౌర్జన్యం
- రూ.50 లక్షల పంట నష్టపరిహారం చెల్లించాలి
- ఎపి రైతు సంఘం, ప్రజా సంఘాల వినతి image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 02, 2026, 07:46 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- రూ.50 లక్షల పంట నష్టపరిహారం చెల్లించాలి

- ఎపి రైతు సంఘం, ప్రజా సంఘాల వినతి

ప్రజాశక్తి - సాలూరు (పార్వతీపురం మన్యం జిల్లా) : దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న గిరిజనుల భూములను అక్రమంగా లాక్కొని, పంటలను ధ్వంసం చేసిన అధికారులపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఎస్‌‌సి, ఎస్‌‌టి అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని ఎపి రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎం.కృష్ణమూర్తి, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. పుల్లేరుగుడ్డి వలస, వంగర గుడ్డివలస, జాతరమ్మ కొత్తవలస గ్రామాలకు చెందిన బాధితులు ఈ సమస్యపై గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణితో మాట్లాడేందుకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకుని మంత్రి అందుబాటులో లేరని చెప్పడంతో మంత్రి పిఎకు వినతిపత్రం అందజేశారు. ​ఈ సందర్భంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ... రామభద్రపురం మండలం కొట్టక్కి, జన్నివలస పరిధిలోని సుమారు వంద ఎకరాల భూమిని 60 గిరిజన కుటుంబాలు గత 40 ఏళ్లుగా సాగుచేసుకుంటూ జీవనం గడుపుతున్నారన్నారు. 2009లో అటవీ హక్కుల చట్టం కింద 17 మందికి నాలుగు ఎకరాల చొప్పున పట్టాలు మంజూరయ్యాయని, మిగిలిన భూమిని కూడా వారే సాగు చేస్తున్నారని స్పష్టం చేశారు. మొక్కజొన్న, పత్తి, కంది, వరితో పాటు మామిడి, జీడి తోటలు సాగు చేస్తుండగా సెప్టెంబర్ తొమ్మిదిన ఎటువంటి ముందస్తు నోటీసులూ ఇవ్వకుండా బొబ్బిలి ఆర్‌‌డిఒ రామ్మోహన్‌రావు, తహశీల్దార్ అజూ రఫీజాన్ పోలీసులు, జెసిబిలు, పొక్లెయినర్లు, బ్లేడు ట్రాక్టర్లతో వచ్చి పంటలను పూర్తిగా ధ్వంసం చేశారని తెలిపారు. రామభద్రపురం పోలీసులు కేసు నమోదు చేయకపోగా, బెదిరింపులకు దిగడం సిగ్గుచేటన్నారు. ఆర్‌ఒఎఫ్ఆర్ అధికారులు సెప్టెంబర్ 15న వచ్చి ఇవి అటవీ భూములేనని ప్రాథమికంగా గుర్తించి, నివేదిక ఇస్తామని చెప్పి 20 రోజులైనా అతీగతీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సంఘాల నాయకులు ఎం.శ్రీనివాసరావు, కె.ఈశ్వరరావు మాట్లాడుతూ అధికారుల దుర్మార్గపు చర్యల వల్ల దాదాపు రూ.50 లక్షల మేర పంట నష్టం వాటిల్లిందని, కనీసం స్మశాన వాటికను కూడా వదలకుండా లాక్కున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపరిహారం చెల్లించి, భూములను గిరిజనులకు అప్పగించకపోతే ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం మండల అధ్యక్షులు వి.సుందరరావు, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి టి.గాసి, నాయకులు వెంకట్, కుసును, రంజు, కార్ల మోహన్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్