- సీడాప్ చైర్మన్ దీపక్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కూటమి ప్రభుత్వం యువతకు మూడు నెలల శిక్షణ ఇచ్చేందుకు ఒక్కొక్కరిపై రూ.లక్ష ఖర్చు చేస్తోందని సీడాప్ చైర్మన్ దీపక్ రెడ్డి అన్నారు. టిడిపి కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వైసిపి నేతలు నెలకు రూ.3వేల నిరుద్యోగ భృతి ఇవ్వలేదంటూ వైసిపి నాయకులు పనిగట్టుకుని నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. మూడేళ్ల నిరుద్యోగ భృతితో సమానమైన మొత్తాన్ని ప్రభుత్వం కేవలం మూడు నెలల్లో యువత భవిష్యత్తు కోసం పెట్టుబడిగా పెడుతోందని చెప్పారు. 1501 శిక్షణా కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 7,79,804 మంది విద్యార్ధులకు నాణ్యమైన శిక్షణ అందించామని తెలిపారు. మంత్రి నారా లోకేష్ 'యువగళం' పాదయాత్రలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆ లక్ష్యం దిశగా అత్యంత వేగంగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఇప్పటివరకు 7,28,347 ఉద్యోగాలు కల్పించామని తెలిపారు.
రాజకీయంగా నిరుద్యోగులైన వైసిపి నేతలకు శిక్షణ ఇచ్చినా ఉద్యోగాలు రావని, ప్రభుత్వం నుంచి 'నిరుద్యోగ భృతి' ఇప్పించేందుకు ప్రయత్నిస్తానని వ్యాఖ్యానించారు.
నేరస్థులే జగన్‌కు ముఖ్యం: సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
మాజీముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి బాధితుల కంటే నేరస్తులే ముఖ్యం అని టిడిపి జాతీయ అధికార ప్రతినిధి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు.
నేరస్తులపై సానుభూతి చూపుతూ విచిత్రమైన జైలు యాత్రలు చేయడం రాజకీయాలకు కలంకమని శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జైలు అనుభవం ఉన్న జగన్ ములాఖత్ నిబంధనలు,సిసిటివి రికార్డింగ్ ప్రోటోకాల్స్ తెలిసినప్పటికీ కావాలనే కూటమి ప్రభుత్వంపై బురదజల్లేందుకు నాటకాలాడుతున్నారని ఆరోపించారు. నేరస్థులను పరామర్శించేందుకు జైలు యాత్రలు చేస్తూ గిన్నీస్ రికార్డు సాధించడం ఖాయమనిపిస్తోందని ఎద్దేవా చేశారు.








కామెంట్‌లు (0)