డిఎస్‌సి స్కామ్‌పై సిబిఐ విచారణకు ఆదేశించాలని కోరాం
- గవర్నర్‌ను కలిసిన అనంతరం మాజీ సిఎం వైఎస్ జగన్
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : శాప్ కార్యాలయం వద్ద వైసిపి నాయకులపై జరిగిన దాడికి సంబంధించిన అన్ని వివరాలనూ ఆధారాలతో సహా గవర్నర్‌కు వివరించామని, మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. బుధవారం సాయంత్రం లోక్‌భవన్లో గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలిసి జగన్ వినతిపత్రం సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ డిఎస్‌సి –2025లో జరిగిన అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలని కోరామన్నారు. వ్యవస్థలో ఒక మార్పు రావాలన్నా, ఈ వ్యవస్థ మీద ప్రజలకు మళ్లీ నమ్మకం రావాలన్నా, లోపాలు సవరించాలన్నా డిఎస్‌సి స్కామ్‌పై కచ్చితంగా సిబిఐ విచారణ జరగాలని గవర్నర్ దృష్టికి తీసుకుపోయినట్లు చెప్పారు. విద్యా శాఖ మంత్రి రాజీనామా కూడా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రశ్నాపత్రం తయారీ, పరీక్ష నిర్వహణ రెండూ ఎస్‌సిఈఆర్‌టీ డైరెక్టర్‌కు అప్పగించారని, దీంతో స్కామ్ ప్రారంభం అయిందని తెలిపారు. అలాగే మొత్తం ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల చేతిలో పెట్టారన్నారు. అలా పని చేస్తున్న నవీన్ అనే వ్యక్తికి కృష్ణా జిల్లాలో ఫస్ట్ ర్యాంక్ వచ్చినా, అతడికి ఉద్యోగం ఇవ్వలేదని, తన పేరు తొలి మెరిట్ లిస్ట్‌లో చూపి, ఆ తర్వాత లిస్ట్‌లో పేరు తొలగించారని కోర్టులో కేసు కూడా వేయడంతో లీకేజీ వ్యవహారం బయటపడిందని తెలిపారు. స్పోర్ట్స్ కోటా పేరుతో అడ్డగోలుగా జీఓలు ఇచ్చారని, గతంలో ఉన్న జిఓలు రద్దు చేసి కొత్తగా 4, 47 జిఓలు తెచ్చి వాటి ద్వారా పరీక్ష రాయాల్సిన అవసరం లేకుండానే 372 ఉద్యోగాలు ఇచ్చారని తెలిపారు. రిక్రూట్‌మెంట్ పూర్తి కాగానే మళ్లీ మూడు జిఓలు తెచ్చి పరీక్ష ఉండాలని నిబంధన పెట్టారని అన్నారు. 372 మందికి ఎలా ఉద్యోగాలు ఇచ్చారన్న దానికి సమాధానం లేదని పేర్కొన్నారు. ఈ విషయాన్ని కూడా గవర్నర్‌కు వివరించామని తెలిపారు. సాఫ్ట్‌బాల్ అసోసియేషన్లకు సంబంధించి కొన్ని జిల్లాలో సెక్రటరీలకు, వారి కుటుంబ సభ్యులకూ ఉద్యోగాలు ఇచ్చారని పేర్కొన్నారు. బేరసారాలపై ఆడియో కూడా బయటకు వచ్చిందన్నారు. దీనిపై సెప్టెంబరు 21న శాప్ ఆఫీస్ వద్ద శాంతియుత నిరసన వ్యక్తం చేస్తున్న వైసిపి నాయకులపై విచక్షణారహితంగా దాడులు చేయించి పైగా దాడిచేసిన వారిపై వారిపై ఎలాంటి చర్యలూ తీసుకోకుండా పూర్తి భిన్నంగా, వైసిపి నాయకులు, కార్యకర్తలు, నిరుద్యోగ యువకులపై హత్యాయత్నం, ఎస్‌సి, ఎస్‌టి అత్యాచార నిరోధక చట్టం కింద 350 మందిపై కేసులు పెట్టారని పేర్కొనాఆ్నరు. రాత్రి వేళల్లో ఇళ్లపై బడి అరెస్టులు చేస్తున్నారని అన్నారు. శాంతియుత నిరసన కార్యక్రమంలో పాల్గొన్న వారిపై రౌడీషీట్లు ఓపెన్ చేశారని, వాటిపైనా కోర్టులు స్పందించాయని వివరించారు. ఇందులో న్యాయం, ధర్మం తప్పకుండా గెలుస్తుందని అన్నారు.
సాయికృష్ణ కేసులో సుప్రీం కోర్టు ఆదేశాలు చెంపదెబ్బ
సాయికృష్ణ లాకప్‌డెత్ విషయంలో సుప్రీంకోర్టు ఆదేశం ప్రభుత్వానికి చెంపదెబ్బని జగన్ అన్నారు. ప్రభుత్వం పిల్లలను వాడుకుంటూ వారితో గంజాయి అమ్మిస్తూ, వారితో చట్టవిరుద్ధమైన పనులు చేయించారని అన్నారు. విజయవాడ పోలీసు కమిషనర్, డిజిపిని ఎందుకు నిందితుల లిస్టులో చేర్చలేదని అడగడం ప్రభుత్వానికి అవమానమని అన్నారు.








కామెంట్‌లు (0)