శుక్రవారం, 20 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ధరల కట్టడికి ఏడాది ప్రణాళిక

4 గంటల క్రితం

cm cbn
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 20, 2026, 10:09 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- ప్రతి వారం సమీక్షించాలి

- రైతుకు నష్టం లేకుండా.. వినియోగదారుడిపై భారం పడకుండా చర్యలు

- సిఎం చంద్రబాబు ఆదేశం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : నిత్యావసర సరుకుల ధరల నియంత్రణకు ఏడాది కాలానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ధరల పెరుగుదలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని, ప్రతి వారం సమీక్ష నిర్వహించాలని స్పష్టం చేశారు. రైతులకు గిట్టుబాటు ధర లభించడంతోపాటు వినియోగదారులకు తక్కువ ధరలకు సరుకులు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో నిత్యావసరాల ధరల నియంత్రణ, మార్కెట్‌ జోక్యంపై ఆయన సమీక్ష నిర్వహించారు. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి రేషన్‌ షాపుల ద్వారా కందిపప్పు, గోధుమ పిండి, పామాయిల్‌ విక్రయించనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. కిలో కందిపప్పు రూ.100, గోధుమ పిండి రూ.25, లీటరు పామాయిల్‌ రూ.125 చొప్పున అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. దీనిపై సిఎం స్పందిస్తూ ద్రవ్యోల్బణం పెరగకుండా వ్యవసాయం, మార్కెటింగ్‌, పౌరసరఫరాలు, రైతుబజార్ల శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ధరలు పెరిగినప్పుడు స్పందించకుండా నిరంతరం మార్కెట్‌ పరిస్థితులను పరిశీలించాలని ఆదేశించారు. కందిపప్పు ధరలు అధికంగా ఉన్నందున భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని కంది సాగును ప్రోత్సహించాలన్నారు. నాసిక్‌ రకం ఉల్లిపాయలను రాష్ట్రంలో ఎక్కడ పండించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయో అధ్యయనం చేసి, ఆయా ప్రాంతాల రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. అవసరమైనప్పుడు మార్కెట్‌లో జోక్యం చేసుకునేందుకు ఖర్చుకు వెనుకాడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం మార్కెట్‌ జోక్యం కోసం ప్రభుత్వం నెలకు సుమారు రూ.100 కోట్లు ఖర్చు చేస్తున్న విషయాన్ని సిఎం ప్రస్తావించారు. రాష్ట్రంలోని బియ్యం నిల్వలు పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హోల్‌సేల్‌ వ్యాపారులు, మిల్లర్ల వద్ద ఉన్న నిల్వల వివరాలు అధికారులకు స్పష్టంగా తెలియాలని చెప్పారు. మార్కెట్‌ వాచ్‌, అగ్రి వాచ్‌ ద్వారా నిరంతరం పరిస్థితులను పర్యవేక్షిస్తూ వ్యూహాత్మకంగా వ్యవహరించాలని సూచించారు.నిత్యావసర సరుకులతోపాటు కూరగాయల ధరలూ అదుపులో ఉండేలా రైతుబజార్లను సమర్థంగా వినియోగించుకోవాలన్నారు. ధరల నియంత్రణపై జిల్లాల వారీగా కలెక్టర్లతో సమావేశాలు నిర్వహించాలని చెప్పారు. అక్రమ నిల్వలు, ధరల కృత్రిమ పెరుగుదలకు అడ్డుకట్ట వేసేందుకు విజిలెన్స్‌ నిఘా పెంచాలని వర్చువల్‌గా పాల్గొన్న డిజిపి హరీష్‌ కుమార్‌ గుప్తాను ఆదేశించారు. ఈ సమావేశంలో సిఎస్‌ సాయి ప్రసాద్‌, పౌరసరఫరాల శాఖ కమిషనర్ కె కన్నబాబు, వ్యవసాయ, ఉద్యాన శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్