- వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రభుత్వాసుపత్రుల్లో లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ (ఎల్‌ఎంవో)కొనుగోళ్లకు సంబంధించి వాస్తవ డిమాండ్, సరఫరా విషయాలపై రెండు వారాల్లో సమగ్రంగా ఆడిట్ నిర్వహించి సమగ్ర నివేదిక అందించాలని వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆ శాఖ అధికారులను ఆదేశించారు. ప్రెషర్ స్వింగ్ అడ్సార్పషన్(పిఎసి)ప్లాంట్లు,ఎల్ఎంఓ కొనుగోళ్ల విషయాలపై మంగళగిరిలోని వైద్య,ఆరోగ్య శాఖ కార్యాలయంలో సోమవారం ఆయన సమీక్ష నిర్వహించారు. కొనుగోళ్లు, వాస్తవ డిమాండ్, సరఫరా అంశాలపై సమగ్రంగా ఆడిట్ నిర్వహించి అక్టోబరు 15 లోగా సమగ్ర నివేదికను సమర్పించాలని ఆదేశించారు. ఎల్ఎంఓ డిమాండ్, సరఫరాలోని వ్యత్యాసాన్ని గుర్తించి ఆక్సిజన్ కొనుగోలు ఖర్చును వీలైనంత వరకు కొవిడ్-19 పూర్వ స్థితికి తీసుకురావాలని చెప్పారు. పిఎసి ప్లాంట్లను పూర్తిస్థాయిలో వినియోగించవచ్చా? ఆర్థికంగా ఈ ఖర్చు సమర్థనీయమా? ఈ నిరర్థక ప్లాంట్లను ఏంచేయాలన్న విషయాలపై కూడా నివేదిక తెప్పించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి వీరపాండియన్, వైద్య విద్య డైరెక్టర్ విష్ణువర్ధన్, అదనపు డైరెక్టర్ రాధికారెడ్డి, జాయింట్ డైరెక్టర్ గణపతిరావు తదితరులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)