మంగళవారం, 29 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయర్‌ ‌పనులు ప్రారంభించాలి

1 రోజు క్రితం

పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయర్‌ ‌పనులు ప్రారంభించాలి
- రాష్ట్ర బడ్జెట్‌లో కనీసం రూ.1,000 కోట్లు విడుదల చేయాలి
- ఎపి రైతుసంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్య image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 27, 2026, 08:36 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- రాష్ట్ర బడ్జెట్‌లో కనీసం రూ.1,000 కోట్లు విడుదల చేయాలి

- ఎపి రైతుసంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్య

ప్రజాశక్తి - ఉదయగిరి (నెల్లూరు జిల్లా) : రాబోయే బడ్జెట్‌లో పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయర్ సాగునీటి ప్రాజెక్టు కోసం కనీసం రూ.వెయ్యి కోట్లు కేటాయించి పనులను ప్రారంభించాలని ఎపి రైతుసంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్య డిమాండ్ చేశారు. పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయర్ ప్రాజెక్టు సాధన కోసం ఉదయగిరి గ్రామపంచాయతీ ఆవరణంలో జిల్లా నాయకులు కాకు వెంకటయ్య అధ్యక్షతన సమావేశం జరిగింది. కృష్ణయ్య ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి ప్రకటించిన విధంగా మూడు సంవత్సరాల్లో ప్రాజెక్టును పూర్తి చేయాలంటే ప్రతి ఏడాదీ రూ.వెయ్యి కోట్ల చొప్పున నిధులు కేటాయించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. నవంబరు – డిసెంబరు నెలల్లో ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకుని, ఫిబ్రవరిలో ప్రవేశపెట్టే రాష్ట్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని కోరారు. కాలువల తవ్వకం, అనుబంధ పనులు, చిన్నచిన్న నిర్మాణాలు చేపట్టేందుకు తక్షణమే కార్యాచరణ రూపొందించాలన్నారు. ప్రాజెక్టు సాధన కోసం రాజకీయాలకతీతంగా ప్రతి గ్రామంలో సమావేశాలు నిర్వహించి, గ్రామసభలు ఏర్పాటు చేసి ప్రజలను చైతన్యవంతం చేయాలని సూచించారు. 1996లో ప్రాజెక్టుకు పునాది రాయి వేసినా, 2026 నాటికి మూడు దశాబ్దాలు గడిచిపోయాయని గుర్తుచేశారు. ఈ కాలంలో సుమారు పది టిఎంసిల నీటిని మాత్రమే విడుదల చేశారని, కాలువలు లేకపోవడంతో ఒక్క ఎకరా భూమికి కూడా సాగునీరందడం లేదని తెలిపారు. ప్రధాన కాలువలతో పాటు గ్రామాల పరిధిలోని చిన్న కాలువలు, అనుబంధ పనులు కూడా వేగంగా చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో రైతుసంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పూడిపర్తి జనార్ధన్, మూలి వెంగయ్య, రైతుసంఘం జిల్లా సీనియర్ నాయకులు చండ్ర రాజగోపాల్, సిఐటియు ప్రాంతీయ కార్యదర్శి కోడే రమణయ్య, రైతులు, ప్రజలు, అన్ని సంఘాల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయరులో పొలాలను పోగొట్టుకున్న రావిళ్ల చెంచు నాగయ్య... కృష్ణయ్యకు వినతి పత్రం అందజేసి ఇంతవరకు అందాల్సిన నగదు అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ గ్రామ భూములను రిలయన్స్ కంపెనీలకు అప్పజెప్పి తమకు జీవనాధారమైన పొలాలను లాగేసుకుంటున్నారని నేలటూరు గ్రామ పరైతు పెండ్యాల మాధవ్ ఆవేదన వ్యక్తం చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్