శుక్రవారం, 20 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

విప్ నిర్ణయానికి వ్యతిరేకంగా పిఠాపురం ఎంపిపి ఎన్నిక

4 గంటల క్రితం

vis
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 20, 2026, 10:12 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - పిఠాపురం : కాకినాడ జిల్లా పిఠాపురం మండల పరిషత్ అధ్యక్ష ఎన్నికల్లో జనసేన అధినాయకత్వం అధికారికంగా ఖరారు చేసిన అభ్యర్థిని ఎంపీటీసీ సభ్యులు తిరస్కరించి, విప్ ఆదేశాలను ధిక్కరిస్తూ వేరొకరిని ఎన్నుకున్నారు. గురువారం ఎంపి ఉదయ్ భాస్కర్, జనసేన నియోజకవర్గ ఇన్ ఛార్జి పెండెం దొరబాబు సమక్షంలో పిఠాపురం మున్సిపల్ కార్యాలయంలో ఎన్నికల అధికారి కె.స్వప్న.. ఎంపిపి, వైస్ ఎంపిపి ఎన్నికలను నిర్వహించారు. సభ్యుల ప్రమాణ స్వీకారం అనంతరం జనసేన ఎంపిటిసి వాసంశెట్టి రాజేశ్వరరావు, టిడిపి ఎంపిటిసి గుడాల వెంకటరమణలను విప్ లుగా ప్రకటించారు. దీంతో ఎంపిపిగా విరవాడ-1 ఎంపిటిసి సభ్యురాలు రామిశెట్టి గంగాపార్వతి పేరును వాసంశెట్టి రాజేశ్వరరావు ప్రతిపాదించారు. జల్లూరు ఎంపిటిసి సబ్బిటి బాబ్జి బలపరిచారు. 22 మంది ఎంపిటిసిలకు నలుగురు మాత్రమే మద్దతు తెలిపారు. ఈ నేపథ్యంలో భోగాపురం జనసేన ఎంపిటిసి సాంబాతుల క్రాంతిబాబు... రాపర్తి జనసేన ఎంపిటిసి వీరంరెడ్డి అమరేశ్వరరావు పేరును ఎంపిపిగా ప్రతిపాదించారు. కందరాడ స్వతంత్ర ఎంపిటిసి సభ్యులు పిల్లా శివశంకర బలపరిచారు. ప్రిసైడింగ్ అధికారి సూచన మేరకు అభ్యర్థిత్వానికి సంబంధించిన ప్రతిపాదనను లిఖితపూర్వకంగా అందజేశారు. అనంతరం నిర్వహించిన ఎన్నికలో 17 మంది ఎంపిటిసిలు అమరేశ్వరరావుకు మద్దతుగా చేతులెత్తారు. దీంతో ఆయన ఎంపిపిగా ఎన్నికైనట్లు ప్రిసైడింగ్ అధికారి ప్రకటించారు. అనంతరం ఎంపి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ మున్సిపల్ కార్యాలయం ఎదుట మాట్లాడారు. ఎన్నికైన అభ్యర్థి వీరంరెడ్డి అమరేశ్వర రావు, బీఫారం పొందిన రామిశెట్టి గంగాపార్వతి చెరో రెండున్నర సంవత్సరాలు పదవీ కాలం చేస్తారని ప్రకటించారు. ఆయన వెంట జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబు ఉన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్