- అసభ్యకర సందేశాలు, వీడియోలతో వేధింపులు
- చంపేస్తానంటూ బెదిరింపులు
ప్రజాశక్తి – కోరుకొండ: బాలికను అసభ్యకరమైన సందేశాలు, వీడియోలతో వేధిస్తూ, బెదిరింపులకు పాల్పడినట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కొల్లపు భాగ్యరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. కోరుకొండ మండలం గుమ్ములూరు గ్రామానికి చెందిన బాలిక గతంలో బూరుగుపూడి గ్రామంలోని యంగ్ ఛాంప్స్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఆరో, ఏడవ తరగతులు చదువుకుంది. ఆ సమయంలో అదే పాఠశాలలో ఇంగ్లీష్ ఉపాధ్యాయుడిగా పనిచేసిన కొల్లపు భాగ్యరాజు తమ కుమార్తె పట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడని బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. నిందితుడు బాలికకు అసభ్యకరమైన సందేశాలు, వీడియోలు పంపడంతో పాటు తనతో మాట్లాడాలని, హత్తుకోవాలని, పెళ్లి చేసుకుంటానని సందేశాలు పంపినట్లు ఆరోపించారు. తనతో మాట్లాడకపోతే చంపేస్తానని, కిడ్నాప్ చేస్తానని బెదిరించినట్లు బాలిక తమకు తెలిపిందని తల్లిదండ్రులు పేర్కొన్నారు. పాఠశాలలో చదువుతున్న సమయంలో అసభ్యంగా తాకడం, ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన ఇంటికి రావాలని ఒత్తిడి చేయడం వంటి చర్యలకు పాల్పడినట్లు ఫిర్యాదులో వివరించారు.
ప్రస్తుతం బాలిక చదువుతున్న పాఠశాలకు వెళ్లే మార్గంలో కనిపిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నాడని, ఈ విషయాలను బయటకు చెబితే చంపేస్తానని బెదిరించడంతో భయపడి ఇన్ని రోజులు చెప్పలేదని బాలిక వెల్లడించినట్లు తల్లిదండ్రులు తెలిపారు. ఇటీవల బాలిక ఫోన్‌లోని సందేశాలు, వీడియోలను గమనించిన తల్లిదండ్రులు ఆమెను విచారించడంతో ఈ విషయాలు వెలుగులోకి వచ్చినట్లు పేర్కొన్నారు. దీంతో బాలిక తల్లిదండ్రులు కోరుకొండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు కొల్లపు భాగ్యరాజును అరెస్ట్ చేశారు.








కామెంట్‌లు (0)