శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పెట్టుబడిదారులకేనా రక్షణ?

14 నవంబర్, 2026

citu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 14, 2026, 10:06 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- కార్మికుల రక్షణ పట్టదా?

- సిఎం వ్యాఖ్యలపై సిఐటియు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: రాష్ట్రంలో పెట్టుబడిదారులకు రక్షణ కల్పించడానికి అసెంబ్లీలో బిల్లు పాస్‌ ‌చేసి కేంద్రం ఆమోదానికి పంపిస్తామని విశాఖపట్నంలో జరిగిన భారత పరిశ్రమల సమాఖ్య (సిఐఐ) సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై సిఐటియు రాష్ట్ర కమిటీ అభ్యంతరం వ్యక్తం చేసింది. కార్మికుల రక్షణ పట్టదా? పెట్టుబడిదారులకేనా రక్షణ? అని యూనియన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సిహెచ్‌ ‌నర్సింగరావు, ఎవి నాగేశ్వరరావు శనివారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. ప్రభుత్వ మార్పులు, విధానాల మార్పులు, రాజకీయ జోక్యాలు, కేటాయించిన భూములను తిరిగి స్వాధీనం చేసుకోవడం నుండి పెట్టుబడులకు రక్షణ కల్పిస్తామని చంద్రబాబు చెప్పారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కూడా దేశవ్యాప్తంగా పెట్టుబడిదారుల నమ్మకాన్ని బలోపేతం చేసేందుకు ఇటువంటి చట్టం చేయాలని కోరారని పేర్కొన్నారు. తమకు రావాల్సిన ప్రభుత్వ ప్రోత్సాహకాల కోసం తన దగ్గరకు రావాల్సిన అవసరం లేకుండా పారిశ్రామికవేత్తలకు ఇచ్చే రాయితీలను ముందుగానే ఒక ఖాతాలోకి (ఎస్క్రో ఖాతా) జమ చేస్తామని హామీనిచ్చారని తెలిపారు. కానీ సంపద సృష్టిస్తున్న కార్మికులకు కనీస వేతనాలను గత వైసిపి, నేటి కూటమి ప్రభుత్వాలు సవరించలేదని ఆందోళన వ్యక్తం చేశారు. గత 12 ఏళ్లుగా రాష్ట్రంలో 50 లక్షల మంది కార్మికులు వేతన పెంపునకు నోచుకోలేదని వెల్లడించారు. కార్మికులకు రక్షణ గురించి నోరు మెదపని కూటమి పెద్దలైన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, లోకేష్‌.. పెట్టుబడుల రక్షణ గురించి మాట్లాడటం శోచనీయమని తెలిపారు. లాభాలు, సంపద సృష్టించేది కార్మికుల శ్రమ మాత్రమే అని తెలిపారు. కార్మికులకు రక్షణ కల్పిస్తేనే పెట్టుబడులకు లాభాలొస్తాయని, పెట్టుబడిదారులు కేవలం తమ పెట్టుబడితో లాభాలు సృష్టించలేరన్న వాస్తవాన్ని ఇప్పటికైనా గ్రహించి కార్మికుల రక్షణ గురించి చర్యలు చేపట్టాలని కోరారు. రాష్ట్రంలో కనీస వేతనాన్ని వెంటనే సవరించాలని, ప్రభుత్వ విధానాల వలన పెరిగిన ప్రస్తుత ధరలు, సుప్రీంకోర్టు ఆదేశాలకనుగుణంగా కనీస వేతనాలను రూ.42 వేలుగా నిర్ణయించి అమలు చేయించాలని డిమాండ్ చేశారు. కార్మికులకు రక్షణ కలిగేలా కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్, అన్ని నాన్ పర్మినెంట్ కార్మికులను వెంటనే రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఇంతకు ముందే పారిశ్రామికవేత్తలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారి వ్యాపారం సులభంగా చేసుకునేందుకు (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్), వేగంగా చేసుకునేందుకు (స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) అవకాశం కల్పించిందని తెలిపారు. రాష్ట్రంలో గతేడాది నవంబరు ఒకటి నుండి కార్మికుల పని గంటలను, పని విస్తృతిని పెంచారని పేర్కొన్నారు. మహిళలతో రాత్రిపూట పని చేయించేలా మార్పులు చేశారని, అనేక పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగి కార్మికులు మరణిస్తున్నా సరైన భద్రతా చర్యలు చేపట్టడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం.. పెట్టుబడిదారుల సేవ మాత్రమే కాక రాష్ట్రంలో సంపద సృష్టిస్తున్న కార్మికులకు, వారి ఉపాధికి, వారి ఉద్యోగ భద్రత రక్షణకు చర్యలు చేపట్టాలని డిమాండ్‌ ‌చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్