సోమవారం, 28 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రజా కళలు మరింత పదునెక్కాలి

2 రోజుల క్రితం

pnm
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 26, 2026, 10:06 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- ప్రజానాట్యమండలి ఉమ్మడి ఎపి పూర్వ కార్యదర్శి శాంతారావు

విజయవాడ : ప్రభుత్వ అసంబద్ధ, అప్రజాస్వామిక విధానాలను నిరసిస్తూ జెన్-జి, జెన్- ఆల్ఫా ఉద్యమాలు ఉవ్వెత్తున సాగుతున్న వేళ ఆ పోరాటాలతో సమన్వయం చేసుకుంటూ కళలు మరింత పదునెక్కాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ప్రజానాట్యమండలి ఉమ్మడి ఎపి పూర్వ కార్యదర్శి, నాటకరంగ విశ్లేషకులు కె. శాంతారావు పేర్కొన్నారు. ఈ నెల 21 - 28 తేదీల్లో జరుగుతున్న "జాషువా" పదో సాంస్కృతికోత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం (ఎంబివికె)లో అలనాటి ప్రముఖ జాతీయ అభ్యుదయ కవి చిలకమర్తి లక్ష్మీనరసింహం 159 వ జయంతి సందర్భంగా నిర్వహించిన సభా కార్యక్రమంలో శాంతారావు ప్రసంగించారు. యువతరాన్ని సామాజిక స్పృహతో, మానవీయ కోణంలో విజ్ఞానవంతులను గావించాల్సుందన్నారు. ఉమ్మడి రాష్ట్రం విడిపోయాక సాంస్కృతిక రంగంలో ఎపి వెనుకబడుతుందేమో అనే సందేహాల్ని జాషువా సాంస్కృతిక వేదిక వంటి సంస్థల కార్యక్రమాలు పటాపంచలు చేస్తున్నాయని అభిప్రాయం వ్యక్తం జేశారు. జాషువా బాధ్యురాలు, ప్రముఖ నటీమణి ఎస్.అమృత వర్షిణి నిర్వహణలో జరిగిన కార్యక్రమంలో జెవివి మాజీ నాయకులు గోపాళం సాంబశివరావు, "అరసం" జిల్లా బాధ్యులు పి.అజయ్ కుమార్ ప్రసంగించారు. ప్రముఖ విద్యావేత్త "వికాసవనం" ఎస్ఆర్ పరిమి సభకు పరిచయమయ్యారు. తొలుత అప్పన్న (ప్రజానాట్యమండలి), చంద్రానాయక్, ఆర్.పిచ్చయ్య (ఎపి ప్రజానాట్యమండలి) అభ్యుదయ గీతాలు ఆలపించారు. సభానంతరం రంగస్థల, సినీ ప్రముఖులు ఎం.సంజీవి 1990 ప్రాంతంలో రచించి.. అనేకానేక పరిషత్తులలో విజయం సాధించిన నాటిక "కదలిక"ను లోయర్ సీలేరు క్రీడా సాంస్కృతిక శాఖ ఎపి జెన్‌‌కో - మోతుగూడెం వారు ప్రదర్శించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్