ముగిసిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు
సర్పంచ్ అభ్యర్థుల ఎంపికలో నాయకులు బిజీ
ప్రజాశక్తి – నార్పల (అనంతపురం) : మండలవ్యాప్తంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ముగియడంతో త్వరలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలపై రాజకీయ నాయకులు దృష్టి సారించారు. మండలంలోని 17 గ్రామ పంచాయతీలకు రిజర్వేషన్ల ఆధారంగా సర్పంచ్ అభ్యర్థుల ఎంపిక, రాజకీయ సమీకరణాల్లో నాయకులు నిమగ్నమయ్యారు. ముఖ్యంగా మండలంలోని మేజర్ పంచాయతీ అయిన నార్పలపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. నార్పల మేజర్ పంచాయతీ సర్పంచ్ స్థానం బీసీ జనరల్‌కు రిజర్వు కావడంతో బరిలో నిలిచే బలమైన బీసీ అభ్యర్థి ఎవరనే అంశంపై మండలవ్యాప్తంగా చర్చ సాగుతోంది.
మండల కేంద్రంలో అధికంగా ఉన్న బోయ, గాండ్ల (తేలికుల), కురవ సామాజిక వర్గాలతో పాటు ముస్లిం మైనారిటీ వర్గాల నుంచి బలమైన అభ్యర్థుల కోసం నాయకులు అన్వేషిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే పలువురి పేర్లు తెరపైకి వచ్చి చర్చనీయాంశంగా మారాయి. ప్రజల్లో వినిపిస్తున్న పేర్లే అభ్యర్థులుగా ఖరారవుతారా? లేక అనూహ్యంగా కొత్త వ్యక్తులు తెరపైకి వస్తారా? అన్న ఆసక్తి నెలకొంది.
రాజకీయ సమీకరణాలు ఎలా ఉన్నప్పటికీ మరో వారం, పది రోజుల్లో అభ్యర్థుల ఎంపికపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే పలువురు ఆశావహులు మండలంలోని వివిధ గ్రామ పంచాయతీల నుంచి సర్పంచ్ ఎన్నికల బరిలో నిలిచేందుకు తమ పేర్లను పరిశీలించాలని నాయకులను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ గుర్తులు లేకపోయినప్పటికీ, అంతర్గతంగా రాజకీయ పార్టీలు ఈ ఎన్నికలను ప్రభావితం చేయడం బహిరంగ రహస్యమే. అభ్యర్థులు ఎవరైనా ఎన్నికలు సజావుగా, శాంతియుత వాతావరణంలో, సామరస్యపూర్వకంగా ఎలాంటి ఘర్షణలకు తావులేకుండా జరగాలని మండల ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. ఇటీవల మండలవ్యాప్తంగా జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ నుంచి పోలింగ్ వరకు అన్ని ఘట్టాలను సమర్థవంతంగా, శాంతియుతంగా నిర్వహించిన ఆర్వో భారతి, ఏఆర్వో మమతాదేవి, సింగనమల సీఐ రాగిరి రామయ్య, నార్పల ఎస్‌ఐ సాగర్‌తో పాటు వివిధ శాఖల అధికారులు, పోలీసు సిబ్బందికి మండల ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు. త్వరలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలను కూడా ఇదే తరహాలో సమర్థవంతంగా, శాంతియుతంగా నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు.







కామెంట్‌లు (0)