ఆదివారం, 29 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసమే ప్రజాస్వామ్యానికి పునాది

12 గంటల క్రితం

న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసమే 
   ప్రజాస్వామ్యానికి పునాది image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 28, 2026, 10:15 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- రాజమహేంద్రవరం జిల్లా కోర్టు 222వ, బార్ అసోసియేషన్ 131వ వార్షికోత్సవంలో వక్తలు

- ఫిబ్రవరి 27 నాటికి ప్రభుత్వ శాఖల్లో లీగల్ ఎఐ : ముఖ్యమంత్రి చంద్రబాబు

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం ప్రతినిధి: న్యాయవ్యవస్థపై ప్రజలకు ఉన్న విశ్వాసమే ప్రజాస్వామ్యానికి పునాది అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అన్నారు. రాజ్యాంగ విలువల పరిరక్షణ, న్యాయవ్యవస్థ స్వతంత్రత, బార్‌-బెంచ్‌ మధ్య సమన్వయం ప్రజాస్వామ్య బలోపేతానికి కీలకమని పేర్కొన్నారు. రాజమహేంద్రవరం జిల్లా కోర్టు 222వ వార్షికోత్సవం, రాజమహేంద్రవరం బార్ అసోసియేషన్ 131వ వార్షికోత్సవ వేడుకలు రాజమహేంద్రవరంలోని మంజీరా సరోవర్ ప్రీమియర్ హోటల్‌లో శనివారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ న్యాయవ్యవస్థలో సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించి ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోందని తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 27 నాటికి ప్రభుత్వ శాఖల్లో లీగల్ ఎఐ వ్యవస్థను అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. కొత్త వ్యవస్థ ద్వారా చట్టాలు, తీర్పులు, ప్రభుత్వ ఉత్తర్వుల సమాచారాన్ని ఒకే వేదికపైకి తెచ్చి కేసుల విశ్లేషణ, న్యాయ పరిశోధన, ఇంగ్లీష్, తెలుగులో న్యాయపత్రాల తయారీకి వీలు కల్పిస్తామన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులు, ఒప్పందాల ముందస్తు సమీక్ష, కోర్టు ఆదేశాల గడువుల పర్యవేక్షణతో అనవసర వ్యాజ్యాలను తగ్గించవచ్చన్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆమోదిస్తే రాజమహేంద్రవరంలో పోక్సో కోర్టు ఏర్పాటుకు సహకరిస్తామని తెలిపారు.

న్యాయ ప్రక్రియలో మానవీయ దృక్పథం ముఖ్యం : జస్టిస్ పిఎస్.నరసింహ

తాళపత్రాల కాలం నుంచి డిజిటల్ వ్యవస్థలు, కృత్రిమ మేధస్సు వరకు న్యాయరంగం అనేక మార్పులకు లోనైందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పిఎస్.నరసింహ పేర్కొన్నారు. సాంకేతికత న్యాయమూర్తులకు సహాయకారిగా ఉండాలే తప్ప, మానవ విచక్షణకు ప్రత్యామ్నాయంగా మారకూడదన్నారు. న్యాయ నిర్ణయాల్లో మానవీయ విలువలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

ప్రతి పౌరుడికీ సమాన న్యాయం అందాలి : జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా

న్యాయస్థానాలపై ప్రజలకు ఉండే విశ్వాసమే న్యాయవ్యవస్థకు అసలైన బలమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా అన్నారు. సామాజిక, ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా ప్రతి పౌరుడికీ సమాన న్యాయం అందాలని పేర్కొన్నారు. న్యాయం సకాలంలో, అందుబాటు ఖర్చుతో సామాన్యులకు చేరాలని, బార్‌–బెంచ్‌ మధ్య పరస్పర గౌరవం, సమన్వయం ఉండాలని తెలిపారు.

న్యాయ వారసత్వం స్ఫూర్తిదాయకం : జస్టిస్ సరస వెంకటనారాయణ భట్టి

రాజమహేంద్రవరం జిల్లా కోర్టుకు ఉన్న 222 ఏళ్ల చరిత్ర ఈ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు ఇచ్చిందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సరస వెంకటనారాయణ భట్టి పేర్కొన్నారు. తరతరాలుగా న్యాయమూర్తులు, న్యాయవాదులు, సిబ్బంది అందించిన సేవలు అభినందనీయమన్నారు. చారిత్రక వారసత్వాన్ని కాపాడుకుంటూ న్యాయ సంస్థలను మరింత బలోపేతం చేయాలని సూచించారు.

బార్‌–బెంచ్‌ సమన్వయంతోనే న్యాయసేవలు : జస్టిస్ లిసా గిల్

న్యాయవ్యవస్థపై ప్రజలకు విశ్వాసం కల్పించడంలో న్యాయమూర్తులు, న్యాయవాదుల పాత్ర కీలకమని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్ పేర్కొన్నారు. న్యాయవాద వృత్తిలో నైతిక విలువలు, వృత్తిపరమైన గౌరవం, బాధ్యతాయుతమైన వ్యవహారశైలి కొనసాగాలని సూచించారు. న్యాయసేవలు సామాన్యులకు చేరువ కావాలంటే బార్‌, బెంచ్‌ మధ్య సహకారం అవసరమన్నారు.

ఎఐ, క్వాంటం టెక్నాలజీతో న్యాయరంగంలో మార్పులు : జస్టిస్ ఎంఎస్.రామచంద్రరావు

కృత్రిమ మేధస్సు, డిజిటల్ వ్యవస్థలు, భవిష్యత్తులో క్వాంటం సాంకేతికత న్యాయరంగంలో కీలక మార్పులు తీసుకురానున్నాయని త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్.రామచంద్రరావు పేర్కొన్నారు.

సావనీర్ ఆవిష్కరణ... ఘన సత్కారాలు

జిల్లా కోర్టు, బార్ అసోసియేషన్ చారిత్రక ప్రస్థానాన్ని ప్రతిబింబించే ప్రత్యేక సావనీర్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు, న్యాయమూర్తులు సంయుక్తంగా ఆవిష్కరించారు. న్యాయరంగానికి విశేష సేవలందించిన సీనియర్ న్యాయవాదులను, 50 ఏళ్లకు పైగా వృత్తి అనుభవం కలిగిన వారిని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా జడ్జి జునైద్ అహ్మద్ మౌలానా, ప్రజాప్రతినిధులు, న్యాయమూర్తులు, న్యాయశాఖ అధికారులు, బార్ అసోసియేషన్ ప్రతినిధులు, న్యాయవాదులు, న్యాయవిద్యార్థులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్