- వచ్చే నెలలో మదనపల్లిలో పూర్వోదయ ప్రాజెక్టు : చంద్రబాబు
- మోడల్ బస్ స్టేషన్ కు శంకుస్థాపన
ప్రజాశక్తి- కుప్పం (చిత్తూరు జిల్లా) : జొన్నగిరి తరహాలో త్వరలో కుప్పం ప్రాంతంలోనూ బంగారం తవ్వకాలు చేపడతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. దీంతో, కుప్పం త్వరలో బంగారు కుప్పం కానుందని పేర్కొన్నారు. కుప్పంలో రూ.118 కోట్లతో నిర్మించనున్న మోడల్ బస్ స్టేషన్లో భాగంగా ఆర్‌టిసి బస్టాండ్, డిపోకు మంత్రి రాంప్రసాద్ రెడ్డితో కలిసి శనివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ ఒకప్పుడు బంగారు గనులు అంటే అది కెజిఎఫ్ మాత్రమేనని, ఇటీవల కర్నూలు జిల్లా జొన్నగిరిలో బంగారు ఉత్పత్తిని ప్రారంభించిన విధంగానే కుప్పంలోనూ బంగారు గనులను త్వరలో ప్రారంభిస్తామన్నారు. గతంలో ఎన్‌టిఆర్ హయాంలో ఆర్‌టిసి బస్ స్టేషన్‌కు శంకుస్థాపన చేశామని, మళ్లీ ఇపుడు మోడల్ బస్ స్టేషన్, డిపోకు శ్రీకారం చుట్టామని తెలిపారు. సోలార్ విద్యుత్ వినియోగించుకునేలా ఆర్‌టిసి బస్ డిపోలో సోలార్ ప్యానళ్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. స్వర్ణ కుప్పం లక్ష్యాన్ని సాధించడానికి మార్గం సుగమం అయ్యేలా పరిశ్రమలు తెస్తున్నామన్నారు. ఉద్యోగాల కోసం కుప్పానికి రావాలే తప్ప, కుప్పం నుంచి వలసలు ఉండకూడదని పేర్కొన్నారు. శుక్రవారం ఒక్క రోజే 30 ప్రాజెక్టులు, రూ.9,322 కోట్ల పెట్టుబడులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, ఎంఒయులు చేసుకున్నామని తెలిపారు. తద్వారా దాదాపు 80 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందన్నారు. అడిడాస్ ఫుట్ వేర్ సంస్థ కోసం ఎన్నో రాష్ట్రాలు ప్రయత్నించినా కుప్పంకే వచ్చిందని తెలిపారు. వచ్చే నెలలో మదనపల్లిలో పూర్వోదయ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి ఉద్యాన పంటలను అభివృద్ధి చేస్తామన్నారు. రాష్ట్రంలో తిరుమల తర్వాత ఎక్కువ గ్రీన్ కవర్ ఉన్న ప్రాంతం కుప్పమే అని తెలిపారు. రూ.34 కోట్ల టిటిడి నిధులతో 140 దేవాలయాల అభివృద్ధి పనులకు చంద్రబాబు శంకుస్థాపన చేశారు.
రైతులకు డికెటి పట్టాల పంపిణీ
అంతకుముందు కంగుందిలో రైతులకు డికెటి పట్టాల పంపిణీకి సంబంధించి శిలాఫలకాన్ని చంద్రబాబు ఆవిష్కరించారు. 460.19 ఎకరాల భూమికి సంబంధించి 322 మంది రైతులకు భూ యాజమాన్య పత్రాలను ఆయన అందించారు. 61 సంవత్సరాల నుంచి పరిష్కారం కాకుండా కంగుంది గ్రామస్తులను భూ సమస్య పీడించిందన్నారు. అడవి పోరంబోకు నుంచి అసైన్డ్ వేస్ట్ డ్రై భూమిగా కేబినెట్‌లో పెట్టి భూములిచ్చేందుకు ఆమోదం తీసుకున్నామని తెలిపారు. కార్యక్రమంలో మంత్రి మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి, చిత్తూరు ఎంపి దగ్గుమళ్ల ప్రసాద్ రావు, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, కుప్పం డవలప్‌మెంట్ అథారిటీ ప్రాజెక్టు డైరెక్టర్ వికాస్ మర్మత్, జిల్లా ఎస్‌పి తుషార్ డూడీ, ఆర్‌టిసి వైస్ చైర్మన్ మునిరత్నం, పికెఎం ఉడా ఛైర్మన్ డాక్టర్ సురేష్ బాబు, టిటిడి బోర్డు సభ్యులు శాంతారామ్, రెస్కో ఛైర్మన్ ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)