ఏలూరులో ఎపి రైతు సంఘం రాష్ట్ర మహాసభ ఉత్సాహపూరిత వాతావరణంలో జరుగుతోంది. ఈ మహాసభకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. వారిలో కొందరు ఆయా జిల్లాల్లో జరిగిన పోరాటాల అనుభవాలను ‘ప్రజాశక్తి’తో పంచుకున్నారు. వారి మాటల్లోనే...
ప్రజాశక్తి- ఏలూరు ప్రతినిధి :
రైతుల సాగు భూములను, పచ్చని పంట పొలాలను పర్రిశమలు, అభివృద్ధి ముసుగులో లాక్కునే కుట్రతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. నక్కపల్లి మండలంలోని బల్క్ డ్రగ్ పార్క్ కు భూసేకణకు వ్యతిరేకంగా పోరాడినందుకు తానై ప్రభుత్వం పీడీ యాక్ట్ నమోదు చేసి నన్ను 45 రోజులు విశాఖ జైల్లో నిర్బంధించింది. బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు వల్ల పర్యావరణానికి హాని కలగడమే కాకుండా, మత్స్యకారుల ఉపాధిని దెబ్బతీస్తుంది. ప్రజలను అనారోగ్యం పాలు చేస్తుంది.
1,270 ఎకరాలను రైతుల నుంచి లాక్కోవాలని ప్రభుత్వం ప్రణాళిక రచించింది. దీనిపై మత్స్యకారులతో కలిసి 79 రోజులు సుదీర్ఘ పోరాటం సాగింది. ఈ పోరాటం హోమంత్రి వనిత ప్రాతినిధ్యం వహిస్తున్న పాయకరావుపేట నియోజకవర్గంలో జరిగింది. మిట్టల్ స్టీల్ ప్లాంట్‌కు ప్రభుత్వం భూములు కేటాయించింది. ఇందుకోసం ఐదు గ్రామాలకు చెందిన 785 కుటుంబాలను వేరే ప్రాంతాలకు తరలించింది. ఈ ప్రక్రియ అంతా చట్టవిరుద్ధంగా సాగింది. 2013 చట్టం నిబంధనలను ఉల్లంఘించింది. న్యాయస్థానాల తీర్పులను పట్టించుకోలేదు. ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులకు న్యాయమైన ప్యాకేజీ ఇవ్వలేదు. రీహెబిటేషన్ కార్డులు ఇవ్వలేదు. వివాహమైన ఆడపిల్లలకు ప్యాకేజీ ఇవ్వకుండా మోసం చేసింది. ఈ అన్యాయాలపై ప్రజల తరఫున నాయకత్వం వహించడంతో ప్రభుత్వం నాపై తీవ్ర నిర్బంధం ప్రయోగించింది. 2025 డిసెంబర్ 24న తెల్లవారుజామున ఆరు గంటలకు నా ఇంటిని చుట్టుముట్టి నన్ను అరెస్టు చేసి ఏ మాత్రమూ సంబంధంలేని పీడీ యాక్ట్ నమోదు చేశారు. విశాఖ కేంద్ర కారాగారంలో సింగిల్ సెల్‌లో పెట్టి ఎటువంటి సౌకర్యాలూ లేకుండా చేశారు. డిటెన్షన్ హక్కులు అమలు చేయలేదు. కుటుంబసభ్యులతో ములాఖత్ లేకుండా చేశారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, హోం మంత్రి అనిత, మంత్రి లోకేష్... కార్పొరేట్లకు కొమ్ముకాసి ఇదంతా చేశారు. నిర్బంధాలకు, కేసులకు భయపడేది లేదు. 23వ రైతు సంఘం రాష్ట్ర మహాసభ ఎంతో స్ఫూర్తినిచ్చింది. అనకాపల్లి జిల్లాలో బలవంతపు భూసేకరణ జరుగుతోంది. గూగుల్ డేటా సెంటర్, సోలార్ పవర్, హైడ్రో పవర్ ప్లాంట్, బల్క్ డ్రగ్ పార్క్, ఎంఎస్‌ఎంఎస్ పర్రిశమలు, ప్రొసెసింగ్ యూనిట్లు ముసుగులో భూసేకరణ చేస్తున్నారు. అక్రమ భూసేకరణపై బాధితులకు అండగా నిలబడతాం.
-ఎపి రైతు సంఘం *అనకాపల్లి జిల్లా రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎం. అప్పలరాజు
నేవీ ఆయుధ డిపో భూసేకరణకు వ్యతిరేకంగా పోరు
నేవీ ఆయుధ డిపో నిర్మాణం పేరుతో రైతుల భూములను 1600 ఎకరాలను బలవంతంగా లాక్కునేందుకు ప్రభుత్వం తీవ్ర ప్రయత్నం చేసింది. తొలుత జీలుగుమిల్లి, తర్వాత కొయ్యలగూడెం మంలాల్లోని పరిసర గ్రామాల్లో దీనికి వ్యతిరేకంగా రైతుల కలిసి పోరాడడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఈ పోరాటంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి సైతం పాల్గొన్నారు. ద్వారకా తిరుమల మండలం పంగిడి గూడెంలో 22 ఎకరాలు ఎస్‌సి, ఎస్‌టిలకు సంబంధించిన భూములపై దీర్ఘకాలిక పోరాటంతో ఇటీవలే ఆన్‌లైన్ చేయడం జరిగింది. దీంతో, 70 మంది రైతులకు న్యాయం జరిగింది. కోకో ధరల పతనంపై పెద్ద ఎత్తున పోరాటం జరిపి రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక తీసుకురాగలిగం. వ్యవసాయ శాఖ మంత్రి సమావేశాలు నిర్వహించారు. కిలోకు అదనంగా రూ.50 ఇచ్చే విధంగా ప్రభుత్వం దిగివచ్చింది. మొక్కజొన్న కంపెనీల మోసాలపైనా, వరి, ఆక్వా రైతుల సమస్యలపైనా జిల్లాలో పోరాటాలు నిర్వహించాం.
-కట్టా భాస్కరరావు, ఎపి రైతు సంఘం ఏలూరు జిల్లా అధ్యక్షులు







కామెంట్‌లు (0)