ఆదివారం, 29 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రైతులకు త్వరితగతిన ఇన్‌పుట్ సబ్సిడీ

12 గంటల క్రితం

రైతులకు త్వరితగతిన ఇన్‌పుట్ సబ్సిడీ
- స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఫండ్‌ పూర్తి వినియోగం
- సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 28, 2026, 10:45 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఫండ్‌ పూర్తి వినియోగం

- సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఒకవైపు కరువు, మరోవైపు తుపానుల బెడద ఉండటంతో ప్రజలను ఆదుకోవడానికి డిజాస్టర్ మేనేజ్‌మెంట్ నిధులను సద్వినియోగం చేసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. కరువు, తుపాన్ల సమయంలో డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఫండ్ ద్వారా బాధితులకు అండగా నిలిచి, వారికి న్యాయం చేయాలన్నారు. ఈ నిధులను పూర్తిగా వినియోగించుకోవడంతో పాటు కేంద్రం నుంచి అదనపు నిధులు సాధించాలన్నారు. ఎల్‌నినో కారణంగా ఏర్పడిన కరువు, అర్నబ్, మురసు తుపాన్లతో రైతులకు జరిగిన నష్టం, ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లింపులపైనా ముఖ్యమంత్రి ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో శనివారం సమీక్షించారు. నష్టపోయిన రైతులకు సాధ్యమైనంత త్వరగా ఇన్‌పుట్ సబ్సిడీ అందించాలని ఆదేశించారు. ఎన్‌‌డిఆర్ఎఫ్ నిబంధనల ప్రకారం కరువు, రెండు తుపాన్ల వల్ల వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక రంగాల్లో జరిగిన నష్టానికి గానూ ఎస్‌‌డిఆర్ఎఫ్ నుంచి రూ.2,459 కోట్లు చెల్లించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. ఇందులో ఒక్క వ్యవసాయ రంగానికి ఎల్‌నినో కారణంగా ఏర్పడిన కరువుకు రూ.1,721 కోట్లు, అర్నబ్ తుపానుకు రూ.602 కోట్లు, మురసు తుపానుకు రూ.97 కోట్లు ప్రతిపాదించినట్లు వివరించారు. ఎస్‌‌డిఆర్ఎఫ్ నిధుల నుంచి ప్రభుత్వం అందించే ఇన్‌పుట్ సబ్సిడీతో పాటు ప్రతి రైతుకూ బీమా సాయం అందేలా చూడాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇందుకు అవసరమైన వివరాలను పక్కాగా సేకరించి, నిధులను నేరుగా బాధిత రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలన్నారు. ఇన్‌పుట్ సబ్సిడీతో పాటు బీమా సొమ్ము కూడా రైతులకు చేరితే వారికి న్యాయం జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో అందుబాటులో ఉన్న నిధులను రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు కార్యాచరణ చేపట్టాలని సూచించారు. హార్టికల్చర్‌కు విబి గ్రామ్‌ ‌జి నిధుల వినియోగానికి ఇప్పటికే ఆమోదం ఉందని పేర్కొన్నారు. ప్రకృతి సేద్యానికీ ఈ నిధులను వినియోగించేందుకు అవసరమైన అనుమతులు సాధించాలని అధికారులకు సూచించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్