సోమవారం, 06 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రజా సమస్యలపై సత్వర స్పందన

2 గంటల క్రితం

cm chandrababu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 06, 2026, 09:37 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- వ్యర్ధాల రహిత పట్టణాలే లక్ష్యం

- సమీక్షలో సిఎం చంద్రబాబు నాయుడు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రజల సమస్యలు, ఇబ్బందులపై సత్వర స్పందన ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. వేగంగా స్పందించగలిగితేనే పౌరులకు మెరుగైన సేవల్ని అందించం సాధ్యమని స్పష్టం చేశారు. విశాఖ సముద్రం తీరంలో బోటు మునిగి మత్స్యకారులు గల్లంతైన ఘటనలో తక్షణ స్పందనగా ఏఏ విభాగాలు ఎలా స్పందించాయన్నదే కీలకమని పేర్కొన్నారు. సిఎస్ ఆధ్వర్యంలో వివిధ శాఖల సమన్వయ సమావేశం జరపాలని సూచించారు. ఆర్టీజీఎస్ కేంద్రం 24 గంటలూ ప్రజలకు సేవలందించేలా చర్యలు చేపట్టాలన్నారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఉన్న ఆర్టిజిఎస్‌ ‌నుంచి అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షా సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. పురపాలక, పంచాయితీరాజ్, హోం, ఎక్సైజ్ తదితర శాఖల ద్వారా అందిస్తున్న ప్రభుత్వ సేవలపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏఐ మెథడాలజీ ద్వారా చిత్తూరు జిల్లాలో సంతృప్తి స్థాయి నమోదు చేస్తున్నారని, అధికారులు క్షేత్రస్థాయి పర్యటనల వల్ల ప్రజాభిప్రాయం నేరుగా తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజాపాలనలో పొలిటికల్ మేనేజ్మెంట్-బ్యూరోక్రటిక్ యాక్షన్ సమపాళ్లలో ఉండాలన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. వివిధ కేటగిరీలు, శాఖలకు చెందిన పీజీఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి ఓ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో ఫలితాలు కనిపించేలా కలెక్టర్లు, ఉన్నతాధికారులు భాద్యత తీసుకోవాలని కోరారు.

గిరిజన ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్లు

గిరిజన ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్ల ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. రాష్ట్రంలో మహిళలపై నేరాలు గణనీయంగా తగ్గాలని... గంజాయి ముఠాలను పూర్తిగా నియంత్రించాలన్నారు. గంజాయి నిర్మూలనపై తీసుకుంటున్న చర్యలపై సమాచారాన్ని ప్రజల్లోకి వెళ్లాలని సీఎం నిర్దేశించారు. కేంద్రం కూడా డ్రగ్స్‌ ‌రహిత భారత్‌ను తయారుచేసేలా కార్యాచరణ చేపట్టిందని దానికి అనుగుణంగానే లక్ష్యాలను నిర్దేశించుకోవాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలతో ఎలాంటి ఫలితాలు సాధిస్తున్నామో అన్న అంశాన్ని కూడా ఎప్పటికప్పుడు విశ్లేషించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో తాగునీరు, వ్యర్ధాల సేకరణకు స్వచ్ఛ రధాలు, ఇంటింటికీ చెత్త సేకరణ లాంటి అంశాల్లో నిర్దుష్టమైన ఎస్ఓపీ జారీ చేయాలన్నారు. మున్సిపాలిటీలు, కార్పోరేషన్లలో పేరుకున్న 23 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను మూడు నెలల్లోగా తొలగించాలని దీనిపై ప్రజాప్రతినిధులు కూడా శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు. వ్యర్ధాలు రహిత పట్టణాలు లక్ష్యం కావాలన్నారు.

ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి ప్రాధాన్యత

ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, పీజీఆర్ఎస్ ద్వారా వస్తున్న దరఖాస్తులను ఆర్ధిక, ఆర్ధికేతర కేటగిరీలుగా విభజించి పరిష్కారం చూపాలని సీఎం స్పష్టం చేశారు. ఈ విషయంలో కలెక్టర్లు అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు. వివిధ సమస్యల్ని ఎదుర్కోనేలా ఇతర ప్రాంతాల్లో అనుసరిస్తున్న ఉత్తమ విధానాలను అనుసరించటంతో పాటు ఆవిష్కరణలపై దృష్టి పెట్టాలన్నారు. ప్రతీ అంశంలోనూ పొదుపు మంత్రం పాటించాలని నిర్దేశించారు. నెలరోజుల్లోగా అన్ని ప్రభుత్వ శాఖలూ అవేర్ 2.0 ద్వారా ఏమేరకు ఫలితాలు వచ్చాయో విశ్లేషించాలని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కమ్యూనికేషన్ నెట్వర్క్ కనెక్టివిటీ కోసం మారుమూల ప్రాంతాల్లో టవర్లను ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ చేపట్టాలన్నారు. ఆపరేటర్లను సంప్రదించి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమీక్షకు మంత్రి కొలుసు పార్ధసారధి, సీఎస్ సాయి ప్రసాద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, పురపాలక, ఎక్సైజ్, పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్