సిపిఎం డిమాండ్
న్యూఢిల్లీ : ఇటీవల అనూహ్యమైన రీతిలో సంభవించిన వరదలతో ఎగువ ఆస్సాంలోని పలు జిల్లాలు తీవ్రంగా ధ్వంసమవడం పట్ల సిపిఎం తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు పొలిట్‌బ్యూరో బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. అస్సాంలో గత నాలుగు వారాలుగా, ఈ వరదల్లో 75మంది మరణించారు. వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. 4వేలకు పైగా గ్రామాల్లో 50లక్షల మందికి పైగా ప్రజలు వరదలకు ప్రభావితులయ్యారు. వరద ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో పశువులు కూడా మరణించాయి. 30జిల్లాల్లో 1.5లక్షల హెక్టార్ల వ్యవసాయ భూములు మునిగిపోయాయని పొలిట్‌బ్యూరో ప్రకటన పేర్కొంది.
నాగాలాండ్ కొండల వైపు నుండి కనివినీ ఎరుగని రీతిలో అకస్మాత్తుగా ఉప్పెనలా నీరు వెల్లువెత్తడం, దీనికి తోడు ఆస్సాంలో భారీ వర్షాలతో ఎగువ అస్సాంలో మూడు జిల్లాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. గత అనేక దశాబ్దాల కాలంలో ఇలాంటి వరదలను రాష్ర్టం ఎన్నడూ చూడలేదని ఆ ప్రకటన పేర్కొంది. అక్రమ గనుల తవ్వకాలు, అనధికార నిర్మాణాల వల్ల సహజసిద్ధమైన మురుగు నీటి వ్యవస్థలు, రక్షిత కట్టడాలు బలహీనపడడమో లేదా నాశనం కావడమో జరిగాయి. దాంతో వరదల ముప్పు మరింత అధికంగా వుంటోందని నివేదికలు సూచిస్తున్నాయి. ఇది తీవ్రంగా ఆందోళన కలిగించే అంశమని పొలిట్‌బ్యూరో పేర్కొంది. గత కొన్నేళ్ళుగా అస్సాంలో పదే పదే వరదలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం చోటు చేసుకున్న విపత్తు అయితే అసాధారణమైన స్థాయిలో వుంది. అరకొరగా వున్న సహాయక చర్యలతో ప్రజల ఇబ్బందులు మరింత పెరిగాయి. వరద బాధిత జిల్లాల్లో చాలా ప్రాంతాలు ఇంకా నీట మునిగే వున్నాయి. ఎవరూ అక్కడకు చేరుకోలేని పరిస్థితులే నెలకొన్నాయి. ఫలితంగా సరైన ఆహారం, నీరు, ఆరోగ్య సంరక్షణ, ఆశ్రయం వంటివేమీ లేకుండా వేలాదిమంది ప్రజలు ఆ ప్రాంతాల్లో చిక్కుండిపోయారు. రాష్ట్ర ప్రజల జీవితాలకు, వారి జీవనోపాధులకు తగిన రక్షణ, భద్రతను కల్పించడంలో బిజెపి పాలిత రాష్ట్ర ప్రభుత్వం దారుణంగా విఫలమైందని పొలిట్‌బ్యూరో విమర్శించింది. వరద రహిత అస్సాంను అందించేందుకు చర్యలు తీసుకుంటామంటూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో వారు ప్రచారం చేస్తూ హామీలిచ్చినప్పటికీ అవి ఎక్కడా అమల్లోకి రాలేదని సిపిఎం విమర్శించింది. అవసరమైన సమయంలో ప్రజలకు తగిన సహాయ సహకారాలు అందించకుండా అస్పాం ప్రజల పట్ల కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఉదాసీనతను కనబరుస్తోంది. సహాయ, పునరావాస చర్యలను బలోపేతం చేసేందుకు రాష్ర్ట ప్రభుత్వానికి అవసరమైన సహాయ సహకారాలను కేంద్ర ప్రభుత్వం అందించాలని పొలిట్‌బ్యూరో డిమాండ్ చేసింది. రాష్ట్రంలో 40శాతం ప్రాంతాలు వరద ముప్పును ఎదుర్కొంటున్నందున ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించేలా సమగ్రంగా చర్యలు చేపట్టాల్సిన అవసరం వుందని పేర్కొంది. కుటుంబ సభ్యులను కోల్పోయిన కుటుంబాలకు, బాధితులకు తగిన నష్టపరిహారం అందించాలని పొలిట్‌బ్యూరో డిమాండ్ చేసింది. అలాగే ఇళ్ళు, పంటలు, పశువులు, జీవనోపాధులు సర్వం కోల్పోయిన వారందరికీ కూడా నష్టపరిహారమివ్వాలని కోరింది. బాధిత ప్రజలు తిరిగి తమ జీవితాలను గౌరవప్రదంగా జీవించడానికి వీలుగా సమగ్ర పునరావాస ప్యాకేజీని ప్రకటించాలని సిపిఎం పొలిట్‌బ్యూరో డిమాండ్ చేసింది. అస్సాంలో సహాయ, పునరావాస కార్యకలాపాల్లో సిపిఎం కార్యకర్తలు ఇప్పటికే చురుకుగా పనిచేస్తున్నారు, పొరుగు రాష్ట్రాల్లోని పార్టీ కార్యకర్తలందరూ కూడా ఈ కార్యక్రమాల్లో చేతులు కలపాలని సిపిఎం పిలుపిచ్చింది.







కామెంట్‌లు (0)