అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో రాగల మూడు రోజులపాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ప్రజలు, ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. సెప్టెంబర్ 19 నాటికి పశ్చిమ రాజస్థాన్‌లోని పలు ప్రాంతాల నుంచి నైరుతి రుతుపవనాలు నిష్క్రమించడానికి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి. వాయువ్య బంగాళాఖాతం, ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల మీదుగా సముద్ర మట్టానికి 1.5 నుంచి 3.1 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. మరోవైపు దక్షిణ అంతర్గత కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా నైరుతి బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించి ఉంది. నిన్న తీరప్రాంత ఆంధ్రప్రదేశ్ పరిసరాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం బలహీనపడినట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
ప్రాంతాల వారీగా రాగల మూడు రోజుల సూచనలు ...
ఉత్తర కోస్తాంధ్ర – యానాం: సోమవారం, మంగళవారం పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయి. ఒకటి లేదా రెండు చోట్ల పిడుగులతో కూడిన మెరుపులు పడే ప్రమాదం ఉంది. గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. ఎల్లుండి కూడా కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కొనసాగే అవకాశముంది.
దక్షిణ కోస్తాంధ్ర : దక్షిణ కోస్తా జిల్లాల్లో నేడు, రేపు అక్కడక్కడా మోస్తరు వర్షాలు పడతాయి. తీరం వెంబడి గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. ఎల్లుండి ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది.
రాయలసీమ : రాయలసీమ పరిధిలో రాగల రెండు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయి. బలమైన గాలుల ప్రభావం ఉంటుందని, ఎల్లుండి నాటికి వర్ష తీవ్రత క్రమంగా తగ్గి ఒకటి రెండు చోట్ల మాత్రమే జల్లులు పడే వీలుందని అధికారులు వెల్లడించారు. ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద ఎవరూ ఆశ్రయం పొందవద్దని అధికారులు ప్రజలను హెచ్చరించారు.








కామెంట్‌లు (0)