సోమవారం, 14 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పరిశీలనకు దూరంగా ఉంటే ప్రజల విశ్వాసం పొందలేం: సీజేఐ

34 నిమిషాల క్రితం

cji
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 14, 2026, 11:17 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ: న్యాయవ్యవస్థ విమర్శలకు అతీతంగా ఉండకూడదని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) సూర్యకాంత్‌ అన్నారు. న్యాయవ్యవస్థపై నిష్పక్షపాతమైన, సమాచారంతో కూడిన, నిర్మాణాత్మక విమర్శలు సజీవ రాజ్యాంగ ప్రజాస్వామ్యంలో అవసరమని పేర్కొన్నారు. సోమవారం జరిగిన 6వ రామ్‌ జెఠ్మలానీ స్మారక ఉపన్యాసంలో ఆయన మాట్లాడారు. ఎన్‌సీఈఆర్‌టీ 8వ తరగతి పాఠ్యపుస్తకంలో న్యాయవ్యవస్థపై చేసిన వ్యాఖ్యల వివాదాన్ని ప్రస్తావిస్తూ.. సంస్థలు పరిశీలన, విమర్శలకు దూరంగా ఉండటం ద్వారా పరిశుభ్రంగా ఉండలేవని సీజేఐ అన్నారు. గతంలో ఈ పాఠ్యపుస్తకంపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టిన విషయాన్ని గుర్తుచేశారు. న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసానికి, చట్టబద్ధమైన విమర్శకు మధ్య ఉన్న సంబంధాన్ని పరిశీలించేందుకు ఈ కేసు ఒక సందర్భంగా నిలిచిందన్నారు.

న్యాయవ్యవస్థ తన పనితీరుపై విమర్శలను స్వీకరించాల్సిందేనని సీజేఐ స్పష్టం చేశారు. విమర్శలు సంస్థాగత జవాబుదారీతనానికి, అవసరమైన స్వీయ దిద్దుబాటుకు దోహదపడతాయని తెలిపారు. కోర్టు తనను తాను పరిశీలనకు అతీతంగా ఉంచుకోవడం ద్వారా ప్రజల విశ్వాసాన్ని పొందలేదని అన్నారు.

‘న్యాయం జరిగినట్లు కనిపించాలి’ అనే న్యాయ సూత్రాన్ని ప్రస్తావిస్తూ.. తీర్పు సరైనదిగా ఉండటంతో పాటు, అది న్యాయంగా జరిగిందనే భావన ప్రజల్లో కలగాలని సీజేఐ పేర్కొన్నారు. కోర్టు ప్రజలకు నచ్చిన తీర్పులు ఇవ్వడం ద్వారా విశ్వాసాన్ని పొందదని, తమకు వ్యతిరేకంగా తీర్పు వచ్చినప్పటికీ విచారణ ప్రక్రియ న్యాయంగా జరిగిందని ప్రజలు విశ్వసించినప్పుడే అసలైన విశ్వాసం ఏర్పడుతుందని చెప్పారు.

న్యాయవ్యవస్థకు పారదర్శకత అంటే బహిరంగ విచారణలు నిర్వహించడం మాత్రమే కాదని సూర్యకాంత్‌ అన్నారు. తీర్పు ఫలితంతో పాటు దానికి దారితీసిన కారణాలను కూడా ప్రజలు పరిశీలించే అవకాశం ఉండాలని తెలిపారు. ప్రజా విశ్వాసమే న్యాయవ్యవస్థ వద్ద ఉన్న అసలైన విలువైన సంపద అని, దాన్ని ప్రతి తీర్పు, ప్రతి కేసు ద్వారా నిరంతరం నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందని సీజేఐ పేర్కొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్