- కబడ్డీ ఆటగాడిపై కేసు
గురుగ్రామ్: బైక్ రైడర్‌ను కారుతో ఢీకొట్టిన ఘటనలో అంతర్జాతీయ కబడ్డీ ఆటగాడిగా చెప్పుకుంటున్న కళ్యాణ్ బైన్‌సాలాపై గురుగ్రామ్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే బైన్‌సాలా అంతర్జాతీయ కబడ్డీ ఆటగాడన్న వాదనను పోలీసులు ఇంకా ధృవీకరించలేదు. గురుగ్రామ్‌లోని గోల్ఫ్ కోర్స్ రోడ్డులో సియా అనే బైక్ రైడర్ తన బైకింగ్ గ్రూప్ సభ్యులతో కలిసి వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు సమాచారం. సియా ఏప్రిలియా ఆర్‌ఎస్ 457 బైక్‌పై ప్రయాణిస్తుండగా ఓ కారు తప్పుడు దిశలో నుంచి ప్రమాదకరంగా సమీపించినట్లు తెలుస్తోంది. కారు వెళ్లేందుకు మార్గం ఇవ్వాలని సియా సైగ చేసిన అనంతరం వివాదం చోటుచేసుకున్నట్లు ఆమె తెలిపింది. కారులోని వ్యక్తులు తనను వెంబడించడంతో పాటు బైక్‌ను ఆపాలని సూచించారని, అసభ్యకరమైన సంజ్ఞలు చేశారని సియా ఆరోపించింది. అనంతరం కారు ఉద్దేశపూర్వకంగా తన బైక్‌ను ఢీకొట్టిందని పేర్కొంది. ఢీకొట్టడంతో ఆమె రోడ్డుపై పడిపోగా.. కారు బైక్‌ను కొంతదూరం ఈడ్చుకెళ్లిన దృశ్యాలు బైక్‌కు అమర్చిన యాక్షన్ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సియా సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు సమాచారం. అనంతరం ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతా తొలగించబడింది. తన సోషల్ మీడియా ఖాతాల్లో కళ్యాణ్ బైన్‌సాలా తనను అంతర్జాతీయ కబడ్డీ ఆటగాడిగా, భారత రగ్బీ జట్టు సభ్యుడిగా పరిచయం చేసుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.







కామెంట్‌లు (0)