బుధవారం, 04 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

500 ఏళ్ల చరిత్రకు వర్షం దెబ్బ!

1 గంట క్రితం

rains
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 04, 2026, 10:34 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- కుప్పకూలిన మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థాన ప్రహరీ గోడ

- పురాతన కట్టడాల పరిరక్షణపై ఆందోళన

ప్రజాశక్తి-మంగళగిరి : చారిత్రక, ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలుస్తున్న మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానానికి మురుసు తుఫాన్ రూపంలో నష్టం వాటిల్లింది. సుమారు 500 ఏళ్ల చరిత్ర కలిగిన దేవస్థాన ప్రాంగణం లోని ప్రహరీ గోడ వర్షాల ప్రభావంతో కూలిపోయింది. ఎన్నో తరాలుగా భక్తుల ఆధ్యాత్మిక విశ్వాసాలకు నిలయంగా ఉన్న ఆలయ ప్రహరీ గోడ కూలిపోవడంతో భక్తుల్లో ఆవేదన వ్యక్తమవుతోంది. వందల ఏళ్ల చరిత్రను తనలో ఇముడ్చుకున్న మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా గుర్తింపు పొందింది. నిత్యం వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు వస్తుంటారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన దేవస్థానంలో పురాతన నిర్మాణాల పరిరక్షణ అత్యంత కీలకమైన అంశంగా మారింది. మురుసు తుఫాన్ ప్రభావంతో ఆలయ ప్రహరీ గోడ కూలిపోవడం పురాతన నిర్మాణాల పటిష్టతపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది. వర్షపు నీరు గోడ పునాదులపై ప్రభావం చూపిందా? నిర్మాణం బలహీనపడటానికి ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే అంశాలను సంబంధిత అధికారులు సాంకేతికంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది.

పురాతన కట్టడాల పరిరక్షణపై దృష్టి ఏదీ?

చారిత్రక ప్రాధాన్యం కలిగిన దేవస్థానాల్లో చిన్నపాటి నిర్మాణ లోపాలను కూడా ముందుగానే గుర్తించి మరమ్మతులు చేపట్టాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉంది. ఒకవైపు ఆలయానికి వచ్చే భక్తుల భద్రత, మరోవైపు వందల ఏళ్ల చారిత్రక వారసత్వాన్ని కాపాడుకోవడం అత్యంత అవసరం. ప్రహరీ గోడ కూలిన ప్రాంతాన్ని వెంటనే పరిశీలించి, ప్రమాదకర పరిస్థితులు ఉంటే నివారణ చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు.

శాశ్వత పరిష్కారం చూపాలి

కూలిపోయిన ప్రహరీ గోడ స్థానంలో నాణ్యతా ప్రమాణాలతో కూడిన పటిష్టమైన నిర్మాణం చేపట్టాలని, పునర్నిర్మాణ పనుల్లో ఆలయ పురాతన నిర్మాణ శైలికి ప్రాధాన్యత ఇవ్వాలని భక్తులు అభిప్రాయపడుతున్నారు. అవసరమైతే పురావస్తు, నిర్మాణ రంగ నిపుణుల సలహాలు తీసుకుని పనులు చేపట్టాలని సూచిస్తున్నారు. వర్షాకాలంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.500 ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయ వారసత్వాన్ని కాపాడుకోవడం అందరి బాధ్యత. తాత్కాలిక మరమ్మతులతో సరిపెట్టకుండా, భవిష్యత్తు తరాలకు ఈ చారిత్రక సంపదను భద్రంగా అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాగా కూలిపోయిన దేవస్థాన ప్రహరి గోడను బుధవారం దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శేఖర్, స్థపతి పరమేశ్వరరావు, దేవస్థాన ఈవో కోగంటి సునీల్ కుమార్ లు పరిశీలించారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్