ప్రైవేటు విద్యుత్ బస్సులపై *ఆర్‌టిసి కార్యాచరణ
గగ్గోలు పెడుతున్న కార్మిక సంఘాలు
క్రమంగా నాన్‌స్టాప్ సర్వీసుల నిలిపివేత
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : ఎపిఎస్‌ఆర్‌టిసిలో ప్రైవేటు విద్యుత్ బస్సులు తీసుకొచ్చే విషయంలో యాజమాన్యం అడుగు ముందుకేసింది. బస్సుల నిర్వహణ ప్రక్రియలో వేగంగా కార్యాచరణకు దిగింది. దీనిలో భాగంగా నగరాల మధ్య నడిచే నాన్ స్టాప్ సర్వీసులను క్రమంగా తగ్గించుకుంటూ వస్తోంది. వాటి స్థానంలో విద్యుత్ బస్సులను ప్రైవేశపెట్టి నడపనుంది. వాటి నిర్వహణలో భాగంగానే ఆర్‌టిసి యాజమాన్యం ఇలాంటి చర్యలకు దిగుతోందని కార్మిక సంఘాలు గగ్గోలు పెడుతున్నాయి. పెద్దపెద్ద నగరాల మధ్య తిరిగి ఆల్ర్టా డీలక్స్ నాన్‌స్టాప్ సర్వీసుల సంస్థకు ఆదాయం పెంచడంలో కీలకంగా ఉన్నాయి. పల్లెవెలుగు సర్వీసుల్లో వస్తున్న లోటును నాన్‌స్టాప్‌లు, ఎక్స్‌ప్రెస్ సర్వీసులు చాలా వరకూ పూడుస్తున్నాయి. వాస్తవంగా స్ర్తీశక్తి పథకం తరువాత అవి కూడా లాభాల్లోకి వస్తున్నాయి. ఆక్యుపెన్సీ రేషియో పెరిగింది. అయినా సర్వీసులను తగ్గించుకుంటూ వస్తున్నారు. ఇటీవల విద్యుత్ బస్సులు తీసుకునే విషయంలో చర్చలు జరుపుతున్న సంస్థ క్రమంగా సర్వీసులను తగ్గించుకుంటూ వస్తోందని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. ప్రస్తుతం గుంటూరు-తెనాలి-విజయవాడ మధ్య నాన్‌స్టాప్ సర్వీసులు ఎక్కువగా ఉన్నాయి. అలాగే విజయనగరం, విశాఖ, విజయవాడ, ఏలూరుతోపాటు అన్ని ప్రధాన నగరాల మధ్య ఉన్న నాన్‌స్టాప్ సర్వీసులు తగ్గించారని తెలిసింది. ఈ విషయాన్ని బయటకు రానీయడం లేదు. అడిగితే అటువంటిదేమీ లేదని చెబుతున్నారు. వాస్తవంగా అన్ని ప్రాంతాల్లోనూ సర్వీసులు తగ్గించుకుంటూ వస్తున్నారు. మరోవైపు గతంలో తీసుకోవాలనుకున్న 1080 బస్సుల్లో ఒప్పందం ప్రకారం జులై నాటికి 750 విద్యుత్ బస్సులు ఇవ్వాల్సి ఉంది. ఇప్పటి వరకూ ఒక్క బస్సు కూడా రాలేదు. అక్టోబరులో రాష్ర్టానికి వస్తాయని ఆర్‌టిసి అధికారులు చెబుతున్నారు. అయితే ఛార్జింగ్ స్టేషన్లు ఇంకా సిద్ధం చేయలేదని, వచ్చినా వాటిని డిపోల్లో పెట్టడమేనని, అందుకే స్టేషన్లు పూర్తయిన వెంటనే తెప్పించేలా కార్యాచరణ రూపొందించామని ఆర్‌టిసి అధికారులు చెబుతున్నారు. వచ్చే బస్సులను ముందుగా నగరాల మధ్య నాన్ స్టాప్ సర్వీసులుగా తిప్పాలని ఇప్పటికే రూట్ షెడ్యూల్‌ను సిద్ధం చేసినట్లు తెలిసింది. ప్రైవేటు బస్సులు, పైగా ఆర్‌టిసి ఆస్తులను సుదీర్ఘకాలం లీజుకు ఇస్తున్న నేపథ్యంలో సమాచారం బయటకు వస్తే వ్యతిరేకత వస్తుందనే భయంతో ఆర్‌టిసి యాజమాన్యం గుంభనంగా వ్యవహారం నడుపుతోంది. ఇటీవల పాత తేదీతో వేసిన మెమోతో సమావేశం నిర్వహించి అదనంగా బస్సులు తీసుకోవాలని చర్చించారు. దానికి విధివిధానాలు రూపొందించారు. విషయం తెలిసిన జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు ఇప్పటికే సంస్థ నష్టపోతున్న నేపథ్యంలో కొత్త బస్సులు తీసుకోవద్దని కోరుతూ వినతిపత్రం ఇచ్చింది. ఒకవేళ కొనాలనుకుంటే యాజమాన్యం కొని నిర్వహించాలని కోరింది. అయితే ఆర్‌టిసి చేసుకున్న ఒప్పందంలో పేర్కొన్న నిబంధనల మేరకు, పిఎం ఇ సేవా బస్ పథకంలో కొత్తగా వచ్చే విద్యుత్ బస్సులు ప్రైవేటు ఆపరేటర్ల ద్వారా నిర్వహించాలని ఏ రాష్ట్ర ఆర్‌టిసి కూడా నేరుగా బస్సులు కొనకూడదని నిబంధన పెట్టిందని ఆర్‌టిసి స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు సిహెచ్ సుందరయ్య తెలిపారు. దీన్ని మార్చాలని కోరారు. ఆర్‌టిసి జెఎసి కూడా ఇదే విషయాన్ని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లింది.








కామెంట్‌లు (0)