శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రభుత్వ వర్సిటీ అధ్యాపకులకు ఊరట

3 రోజుల క్రితం

ap-high-court
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 23, 2026, 08:15 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- వేతనాల ప్రాతిపదికన దరఖాస్తుల తిరస్కరణ చెల్లదు

- ఎనిమిదేళ్ల బోధనా అనుభవాన్ని పరిగణనలోకి తీసుకోవాలి

- హైకోర్టు తీర్పు

ప్రజాశక్తి-అమరావతి : రాష్ట్రంలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక పోస్టుల భర్తీకి సంబంధించి కాంట్రాక్టు, అడహాక్, తాత్కాలిక, అకడమిక్ కన్సల్టెంట్ అధ్యాపకులకు హైకోర్టు ఊరటనిచ్చింది. అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు యుజిసి నిబంధనల ప్రకారం రెగ్యులర్ అసిస్టెంట్ ప్రొఫెసర్లకు చెల్లించే స్థాయిలో వేతనాలు అందలేదనే కారణంతో వారి దరఖాస్తులను తిరస్కరించడం చెల్లదని స్పష్టం చేసింది. ఎనిమిదేళ్ల నాణ్యమైన బోధనా అనుభవం ఉన్న అభ్యర్థుల అర్హతను గతంలో పొందిన వేతనాల ఆధారంగా నిర్ణయించడానికి వీల్లేదని పేర్కొంది. విద్యార్హతలు, బోధనా అనుభవమే నియామకాలకు ప్రాతిపదికగా ఉండాలని, వేతనాన్ని అర్హత ప్రమాణంగా పరిగణించడం ఏకపక్షమని తెలిపింది. ఈ మేరకు అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు పిటిషనర్లు చేసుకున్న దరఖాస్తులను గత వేతనాలతో సంబంధం లేకుండా, వారి బోధనా అనుభవం ఆధారంగా పునఃపరిశీలించాలని రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలను ఆదేశించింది. యుజిసి నిబంధనల్లోని రెగ్యులేషన్ 10(ఎఫ్)(3)ను ఈ విధంగా వర్తింపజేయడం రాజ్యాంగంలోని అధికరణ 14కు విరుద్ధమని జస్టిస్ న్యాపతి విజయ్ ఉమ్మడి తీర్పులో పేర్కొన్నారు.

రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో సుమారు 1,500 అధ్యాపక పోస్టుల భర్తీకి 2026 మే 15న నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. వీటిలో అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న పలువురు కాంట్రాక్టు, అడహాక్, తాత్కాలిక, అకడమిక్ కన్సల్టెంట్ అధ్యాపకుల దరఖాస్తులను విశ్వవిద్యాలయాలు తిరస్కరించాయి. 2018 యుజిసి నిబంధనల్లోని రెగ్యులేషన్ 10(ఎఫ్)(3) ప్రకారం అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు సమానమైన స్థూల వేతనం పొందిన అనుభవం లేదని పేర్కొన్నాయి. దీనిపై నెల్లూరు విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో ఆర్థికశాస్త్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ (కాంట్రాక్టు)గా పనిచేస్తున్న గుణకల శివయ్యతోపాటు ఇతర విశ్వవిద్యాలయాలకు చెందిన పలువురు హైకోర్టును ఆశ్రయించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్