- ఈ నెల 8 నుంచి స్లాట్లు ప్రారంభం
- వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : వికలాంగుల వైకల్య అంచనా, ధ్రువీకరణ ప్రక్రియను రాష్ట్రప్రభుత్వం కుదించనుంది. ఇప్పటి వరకు ఉన్న రాష్ట్రంలో ఏ జిల్లాలోనైనా సదరం ధృవీకరణ పత్రం విడుదల చేసే విధానాన్ని కొత్తగా జోనల్ విధానానికి మార్చనుంది. మరింత పారదర్శకంగా, స్నేహాపూర్వకంగా నిర్వహించేందుకు వీలుగా ఈ సంస్కరణలను అమలుచేయబోతున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. వికలాంగులు వ్యయప్రయాసలకు గురికాకుండా ఉండేందుకు వీలుగా రాష్ట్రాన్ని యూనిట్ గా కాకుండా స్లాట్ బుకింగ్ ను జోనల్ స్థాయిలో చేసుకోవడానికి వీలు కల్పించాలని నిర్ణయించినట్లు తెలిపారు. స్లాట్ బుకింగ్‌లో తప్పుడు విధానాన్ని అనుసరించకుండా ఉండేందుకు 'సెల్ఫ్ డిక్లరేషన్ (స్వీయ హామీపత్రం) విధానాన్ని, సదరం కింద వైకల్య పరీక్షలు జరిగేందుకు ముందుగానే ఆన్‌లైన్ ద్వారా దివ్యాంగులు తప్పనిసరి హాజరు నమోదు విధానాన్ని ప్రవేశపెట్టబోతున్నట్లు తెలిపారు. ఈ నెల 8 నుంచి 'స్లాటు' బుకింగ్ విధానాన్ని పునరుద్ధరించబోతున్నామని, వీటితోపాటే కీలక మార్పులు అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. ఈ విధానంపై వైద్యులు, అధికారులపై పనిఒత్తిడి తగ్గుతుందని, దివ్యాంగులకు ప్రయాణపరంగా వెసులుబాటు ఆర్థిక సమస్యలు తగ్గుతాయని వివరించారు. ఈనెల 13 నుంచి ఎంపిక చేసిన ఆసుపత్రుల్లో వైకల్య నిర్ధారణ పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు. గడిచిన తొలి త్రైమాసికoలో 80వేల మంది స్లాట్ బుకింగ్ చేసుకున్నారని, జూలై 8 నుంచి ఆగస్టు చివరి వరకు స్లాట్ బుకింగ్ అవకాశాన్ని కల్పిస్తారని తెలిపారు. అమలులోనికి రానున్న సంస్కరణలపై దివ్యాంగుల్లో అవగాహన కల్పిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సెకండరీ హెల్త్ డైరెక్టర్ కెవిఎన్ చక్రధర్ బాబు కొత్త నిబంధనలను హెచ్ఓడి, జిల్లా అధికారులకు పంపించారు. అభ్యర్థులు తమ జిల్లాకు దగ్గర్లోని (జోనల్ ప్రతిపాదికన) జిల్లాల్లో మాత్రమే స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ సేవలు పూర్తిగా ఉచితమని, స్లాట్ బుకింగ్, వైకల్య ధృవీకరణ పత్రాల జారీ కోసం అనధికార మధ్యవర్తులకు లేదా దళారులకు ఎలాంటి డబ్బు చెల్లించొద్దని తెలిపారు.
జోన్లు ఇలా
జోన్-1 : శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం
జోన్-2: అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ.
జోన్-3 : పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, పోలవరం
జోన్-4 : గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు,
జోన్-5: తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్ కడప
జోన్-6 : నంద్యాల, అనంతపురం, కర్నూలు, శ్రీ సత్యసాయి.








కామెంట్‌లు (0)