- మంత్రి కొండపల్లి శ్రీనివాస్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలోని అత్యంత నిరుపేద కుటుంబాలను గుర్తించి, వారిని ఆర్థికంగా నిలబెట్టేందుకు ప్రభుత్వం ‘సమావేశి ఆజీవిక యోజన’ అనే ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. దీనదయాళ్ అంత్యోదయ యోజన - జాతీయ గ్రామీణ జీవనోపాధుల మిషన్ కింద ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్టు మంత్రి సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. తీవ్ర పేదరికం వల్ల స్వయం సహాయక సంఘాల పరిధిలోకి రాని, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందని నిరుపేద కుటుంబాలను గుర్తించి, పేదరికం నుంచి బయట పడేయడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని మంత్రి తెలిపారు. యానాది, చెంచు కులాల జనాభా ఎక్కువగా ఉన్న 26 మండలాల్లోని 650 గ్రామ సంఘాల ద్వారా 10 వేల అతి నిరుపేద కుటుంబాలను ఎంపిక చేసి, భాగస్వామ్య గ్రామీణ మదింపు, గృహ సర్వేల ద్వారా కుటుంబాలను గుర్తిస్తామన్నారు. ప్రత్యేకంగా రూపొందించిన ఎస్‌ఎవైఎఎం యాప్ ద్వారా వల్లార్‌బులిటీ ఇండెక్స్ ఆధారంగా ప్రాధాన్యతా ర్యాంకింగ్ ఇస్తారని పేర్కొన్నారు. మండల సమాఖ్యలు ఎంపిక చేసే 100 మంది ఉపాధి సఖులు ప్రతి ఒక్కరూ 100 కుటుంబాలకు మార్గదర్శకత్వం వహిస్తూ సహాయపడతారని.. ప్రతి కుటుంబానికి తగిన ప్రత్యేక జీవనోపాధి ప్రణాళికను సిద్ధం చేస్తారని మంత్రి తెలిపారు. ఇందులో ప్రకృతి వ్యవసాయానికి ప్రథమ ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు బ్యాంకుల నుంచి రుణ సదుపాయం కల్పించి, ఆస్తుల ఏర్పాటు వరకు ఉపాధి సఖులు తోడ్పాటు అందిస్తారని.. ఈ కార్యక్రమానికి ‘సెంటర్ ఫర్ రీసెర్చ్ ఇన్ స్కీమ్స్ అండ్ పాలసీస్’ సాంకేతిక సహకారాన్ని అందిస్తోందన్నారు. ఈ నెల 21న సెర్ప్ కార్యాలయంలో 26 మండల సమాఖ్యల అధ్యక్షులతో సమావేశం, యాప్‌పై శిక్షణ ఉంటుందని.. 25 నుంచి 30 మధ్య గ్రామ సంఘాల ఆధ్వర్యంలో పిఆర్‌ఎ నిర్వహిస్తూ ఉపాధి సఖులకు శిక్షణ ఇస్తారని తెలిపారు. నవంబర్ 1 నుంచి 15 తేదీల మధ్యలో గృహ సర్వే నిర్వహణ, 16న అత్యంత నిరుపేద కుటుంబాల తుది జాబితా ప్రకటన తర్వాత డిసెంబర్‌లో కుటుంబాల వారీగా జీవనోపాధుల గుర్తింపు ఉంటుందన్నారు. వచ్చే జనవరి నుంచి బ్యాంకు అనుసంధానం జీవనోపాధి ఆస్తుల ఏర్పాటు ప్రక్రియ మొదలవుతుందన్నారు.








కామెంట్‌లు (0)