- ముగ్గురికి గాయాలు
ప్రజాశక్తి - ఆరిలోవ (విశాఖపట్నం): కైలాసగిరి ఘాట్ రోడ్డులో స్కూలు బస్సు బోల్తా పడటంతో ఇద్దరు విద్యార్థులు, ఉపాధ్యాయుడు గాయపడ్డారు. ప్రాణనష్టం లేకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. శనివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసుల కథనం మేరకు... తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం ప్రాంతంలోని శ్రీ ఆదర్శ ఇంగ్లీష్ మీడియం స్కూలుకు చెందిన 37 మంది విద్యార్థులు, ఇద్దరు సిబ్బంది స్కూలు బస్సులో విహారయాత్ర నిమిత్తం కైలాసగిరికి వచ్చారు. మధ్యాహ్నం సుమారు మూడు గంటల సమయంలో కొండపై నుంచి తిరిగి వస్తుండగా ఆఖరి మలుపు వద్దకు వచ్చేసరికి బస్సు బ్రేక్ ఫెయిలవడం, ఓవర్ స్పీడ్ కారణంగా బస్సు ఒకవైపు పూర్తిగా బోల్తాపడింది. దీంతో, విద్యార్థులు అశ్విత్ ఎడమ చేతికి, సాత్విక్ ఎడమ కన్నుకు, ఉపాధ్యాయుడు గంగాధర్ ఎడమ చేతికి గాయాలవడంతో వారిని దగ్గరలోని ఓ ప్రయివేటుకు ఆస్పత్రికి తరలించారు. ద్వారకా ఎసిపి సిహెచ్.మల్లేశ్వ్రరరావు, సిఐ శ్రీనివాసరావు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
పవన్, లోకేష్ ఆరా
ప్రమాదంపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆరా తీశారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలు, వైద్య సహాయక చర్యల పురోగతిపై విశాఖపట్నం, కాకినాడ జిల్లా కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. పాఠశాలలకు చెందిన బస్సుల కండిషన్‌పై రవాణా, సంబంధిత శాఖల అధికారులు నిరంతరం తనిఖీలు నిర్వహించాలని, ముఖ్యంగా విద్యా విహార యాత్రలకు విద్యార్థులను తీసుకెళ్లే సమయంలో బస్సుల బ్రేకులు, ఇతర సాంకేతిక అంశాలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే ప్రయాణానికి అనుమతించేలా చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. ఈ ఘటనపై రాష్ట్ర విద్య, ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ ఆరా తీశారు.









కామెంట్‌లు (0)