ఆదివారం, 29 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నేడు రెండో విడత పంచాయతీ పోరు...

10 గంటల క్రితం

poling
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 29, 2026, 12:53 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- ఏర్పాట్లు పూర్తి

-3803 సర్పంచ్, 29,603 వార్డు సభ్యులకు ఎన్నికలు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ​ నేడు (ఆదివారం) జరగనున్న రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది. 27 జిల్లాల్లోని 52 డివిజన్లు, 246 మండలాల పరిధిలో ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్ ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. రెండో విడతలో 4,975 సర్పంచి స్థానాలకు నోటిఫికేషన్ విడుదల చేయగా, 1,170 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 3,803 స్థానాలకు 10,295 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 49,318 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికల ప్రక్రియ చేపట్టగా, 19,665 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 29,603 వార్డులకు 63,395 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. తొలుత 50,476 పోలింగ్ కేంద్రాలను గుర్తించగా, నామినేషన్ల ఉపసంహరణ, ఏకగ్రీవాలు, హేతుబద్ధీకరణ అనంతరం వాటి సంఖ్య 37,019కి తగ్గింది. ఎన్నికల నిర్వహణను నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రధాన కార్యాలయం నుంచి 9,300 కెమెరాలను కేటాయించారు. వీటితోపాటు 8,470 పోలింగ్ గదుల్లో వీడియో చిత్రీకరణ, 5,186 గదుల్లో వెబ్‌కాస్టింగ్, మరో 3,469 గదుల్లో ఇతర పర్యవేక్షణ ఏర్పాట్లు చేశారు. పోలింగ్ ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు అవకాశం లేకుండా అధికారులు చర్యలు చేపట్టారు. ఎన్నికల నియమావళి అమలు, శాంతిభద్రతల పరిరక్షణతోపాటు ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.

36,485 మందితో భారీ బందోబస్తు : డిజిపి

రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో 36,485 మందితో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డిజిపి హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. ఎన్నికల ఫలితాల అనంతరం విజయోత్సవాల పేరుతో ర్యాలీలు, ఊరేగింపులకు అనుమతి లేదని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల బందోబస్తు కోసం 1,810 రూట్ మొబైల్ బృందాలు, 737 స్ట్రైకింగ్ ఫోర్స్ బృందాలు, ప్రత్యేక స్ట్రైకింగ్ ఫోర్స్ బృందాలతో పాటు 278 చెక్‌పోస్టులను ఏర్పాటు చేసినట్లు వివరించారు. పోలీసు ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక కమాండ్ కంట్రోల్ వ్యవస్థ ద్వారా క్షేత్రస్థాయి పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించనున్నట్లు వెల్లడించారు. ఎక్కడైనా సమస్యలు తలెత్తితే తక్షణమే స్పందించేలా ఏర్పాట్లు చేశామన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్