బుధవారం, 25 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఅమరావతికి రెండో విడత రుణం

12 నిమిషాల క్రితం

Land pooling in Kantheru and Tadikonda
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 26, 2026, 12:05 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • రూ.15 వేల కోట్లు విడుదలకు ప్రపంచబ్యాంకు ప్రాథమిక ఆమోదం

  • సిఆర్‌‌డిఎ అధికారులతో సమీక్ష

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాజధాని అమరాతి నిర్మాణం కోసం రెండో విడతగా రూ.15 వేల కోట్లు ఇచ్చేందుకు ప్రపంచబ్యాంకు ప్రాథమిక ఆమోదం తెలిపింది. దీనిపై బుధవారం సిఆర్‌‌డిఎ కార్యాలయంలో జరిగిన సమీక్షలో గతంలో జరిగిన పనులకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్న ప్రపంచబ్యాంకు ప్రతినిధి బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించింది. ట్రంక్‌ ఇన్‌ఫ్రాతోపాటు వరద నివారణ పనులనూ బృంద సభ్యులు పరిశీలించారు. కృష్ణానది కరకట్ట విస్తరణ పనులకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. పని ప్రాంతాల్లో కార్మికుల సంఖ్యకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని అధికారులను కోరారు. మొదటివిడత ఇచ్చిన నిధులకు సంబంధించిన పనుల పర్యవేక్షణతోపాటు రెండోవిడత నిధుల విడుదలకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు ప్రపంచ బ్యాంకు(ఐబిఆర్‌‌డి), ఆసియా డెవలప్‌మెంట్‌ ‌బ్యాంకు(ఎడిబి) చెందిన బృందం గురువారం ఎపిసిఆర్‌‌డిఏ, ఎడిసిఎల్‌, ఎజిఐసిఎల్‌ అధికారులతో సిఆర్డిఏ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించింది. అమరావతిలో చేపడుతున్న పనుల అమలు పురోగతి, ఫలితాలు, అదనపు నిధుల విడుదల, భవిష్యత్ కార్యాచరణకు సంబంధించిన అంశాలపై ప్రతినిధుల బృంద సభ్యులు సమీక్షించారు. సామాజిక భద్రత, పర్యావరణ పరిరక్షణ, లేబర్ క్యాంపులలో కార్మికుల భద్రతకు సంబంధించిన అంశాలు, సమాచార పంపిణీ, కమ్యూనికేషన్ ప్లాన్, గ్రీవెన్స్ రిడ్రెస్సల్ మేనేజ్‌మెంట్ రాజధాని రైతుల నుంచి వచ్చే ఫిర్యాదుల పరిష్కారం, రాజధాని ప్రాంత ప్రజల భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న కార్యక్రమాలతో పాటు సామాజిక, ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన వివిధ కార్యక్రమాల అమలు పురోగతిని ప్రతినిధులు అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే వైకుంఠపురం పంపింగ్ స్టేషన్, అమరావతిలో రివర్‌ఫ్రంట్‌గా అభివృద్ధి చేయనున్న ప్రాంతాలు, సీడ్ యాక్సిస్ రహదారి, రెండవ, మూడవ ఫేజ్ ప్రాజెక్టులనూ పరిశీలించారు. ప్రస్తుతం జరుగుతున్న పనుల్లో కార్మికుల సంఖ్యకు సంబంధించిన అంశాలతోపాటు వారి రక్షణకు తీసుకుంటున్న చర్యలపైనా కమిషనర్‌‌ను అడిగి వివరాలు తీసుకున్నారు. ప్రస్తుతం చేపట్టిన పనులు నిబంధనలకు అనుగుణంగా లేవని, వాటిని సరిచేయాలని సూచించారు. అధికారులు ఇచ్చిన నివేదికతోపాటు పిజిఎంసి ఇచ్చిన నివేదికను పరిశీలించి తేడాలు ఉండటంపై కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. పనులు జరుగుతున్న నేపథ్యంలో రెండో దశ నిధులకు సంబంధించిన అంశాలపై ఆమోదం తెలిపినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన అగ్రిమెంటు పూర్తయిన తరువాత నిధులు విడుదలవుతాయని అధికారులు తెలిపారు. ఈ బృందంలో క్వింగ్యున్‌‌షేన్‌, రఘు, మానస సెహగల్‌, యోహోన్నస్‌ ‌కెసెటే, బాయన వెంకట్‌, జోసెఫ్‌ అక్పోకోడ్జె, రంజన్‌ ‌వర్మ, నూకల వెంకట్‌, వేదమూర్తి జయదేవప్ప, ఎస్‌.కృష్ణమూర్తి, మాక్సిమిలన్‌ సంజయ్‌‌జోషి, అశ్విని విశ్వనాథన్‌ ‌తదితరులు పాల్గొన్నారు. వీరు మూడు రోజులపాటు అమరావతిలో జరిగే పనులకు సంబంధించిన అంశాలను పరిశీలించనున్నారు. ప్రపంచబ్యాంకు బృందంతోపాటు సిఆర్‌‌డిఏ కమిషనర్‌ విజయ రామరాజు, అడిషనల్ కమిషనర్లు సూర్యసాయి ప్రవీణ్ చంద్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, అభిషేక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్