కనీస వేతనానికి నిర్దిష్ట ప్రమాణాలు లేవు
సమ్మె హక్కుకు సంకెళ్లు.. సామాజిక భద్రతకు మంగళం
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : గతంలో అమల్లో ఉన్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు కోడ్లను మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది. దేశ కార్మికవర్గం సుదీర్ఘ పోరాటాలతో సాధించుకున్న హక్కులను హరించే ఈ నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలన్నదే సిఐటియు పిలుపునిచ్చిన పార్లమెంట్ మార్చ్‌లో ప్రధాన డిమాండ్‌గా ఉంది. ఈ నాలుగు కోడ్లు పూర్తిగా కార్పొరేట్ సంస్థల ప్రయోజనాలకు అనుగుణంగా రూపొందించారని కార్మిక సంఘాలు విమర్శిస్తున్నాయి. వేతన భద్రత, సమ్మె హక్కు, సామాజిక భద్రత, ఉద్యోగ భద్రత వంటి కీలక హక్కులకు ఈ కోడ్లతో ముప్పు తప్పదని పేర్కొంటున్నాయి. వేతన కోడ్‌లో కనీస వేతనం అంటే ఏమిటో స్పష్టంగా నిర్వచించలేదని కార్మిక సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. కనీస వేతనం నిర్ణయించడానికి అవసరమైన నిర్దిష్ట ప్రమాణాలనూ పొందుపరచలేదని విమర్శిస్తున్నాయి. నేషనల్ ఫ్లోర్ లెవల్ వేజ్ పేరుతో కనీస వేతనాన్ని నిర్ణయించే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వానికి కట్టబెట్టారని పేర్కొంటున్నాయి. దీంతో కార్మికులకు గౌరవప్రదమైన జీవితం, జీవనోపాధి కల్పించాలన్న రాజ్యాంగ హామీకి విఘాతం కలుగుతోందని తెలిపాయి. ఇటీవల కేంద్రం రూపొందించిన వేతన నిబంధనల్లోనూ కనీస వేతనం నిర్ణయించే ప్రమాణాలను తొలగించారని విమర్శిస్తున్నాయి. గతంలో అమల్లో ఉన్న పారిశ్రామిక వివాదాల చట్టం ప్రకారం 14 రోజుల ముందస్తు సమ్మె నోటీసు నిబంధన కేవలం ప్రజా సేవా రంగంలోని కార్మికులకే వర్తించేది. కొత్త పారిశ్రామిక సంబంధాల కోడ్‌తో ఈ నిబంధనను అన్ని పరిశ్రమలకు విస్తరించారు. సమ్మె నోటీసు ఇచ్చిన వెంటనే రాజీ ప్రక్రియ ప్రారంభమయ్యేలా నిబంధనలు రూపొందించారు. రాజీ ప్రయత్నాలు కొనసాగుతున్న సమయంలో సమ్మె చేయడాన్ని చట్టవిరుద్ధంగా పరిగణిస్తున్నారు. దీంతో కార్మికుల సమ్మె హక్కుపై తీవ్ర ఆంక్షలు ఏర్పడ్డాయని సిఐటియు విమర్శిస్తోంది. కార్మిక సంఘాలను పరిశ్రమల నుంచి దూరం చేసే నిబంధనలూ ఇందులో ఉన్నాయని పేర్కొంటోంది. ట్రేడ్ యూనియన్ల రిజిస్ట్రేషన్ కష్టతరం చేయడంతో పాటు, వాటి రిజిస్ట్రేషన్ రద్దు ప్రక్రియను సులభతరం చేశారని విమర్శిస్తోంది. ప్రభుత్వ అనుమతి లేకుండా కార్మికులను తొలగించేందుకు వర్తించే సంస్థల్లో ఉద్యోగుల సంఖ్య పరిమితిని 100 నుంచి 300కు పెంచడంతో యాజమాన్యాలకు మరింత స్వేచ్ఛ కల్పించారని పేర్కొంటోంది.
సామాజిక భద్రతా కోడ్ : సార్వత్రిక భద్రత ప్రశ్నార్థకం
సామాజిక భద్రతా పథకాల అమలుకు ప్రభుత్వం నిధులు కేటాయించేలా స్పష్టమైన హామీ లేదని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. ఇపిఎఫ్, ఇఎస్‌ఐ, ప్రసూతి ప్రయోజనాలు పొందేందుకు నిర్దిష్ట సంఖ్యలో కార్మికులు ఉండాలనే నిబంధనను కొనసాగించారని విమర్శిస్తున్నాయి. దీంతో అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత అందని పరిస్థితి ఏర్పడుతోందని పేర్కొంటున్నాయి. సార్వత్రిక సామాజిక భద్రత కల్పిస్తామన్న ప్రభుత్వ వాదన ఆచరణలో నెరవేరడం లేదని విమర్శిస్తున్నాయి.
పని గంటలు పెంపు.. ఉద్యోగ భద్రతకు ముప్పు
వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితులకు సంబంధించిన కోడ్‌తో అదనపు వేతనం చెల్లించకుండానే పని గంటలను పెంచుకునే అవకాశం యాజమాన్యాలకు కల్పిస్తున్నారని కార్మిక సంఘాలు విమర్శిస్తున్నాయి. పని ప్రదేశాల్లో భద్రతకు సంబంధించిన నిబంధనలను కూడా నీరుగార్చారని తెలిపాయి. నిర్ణీత పని ఉద్యోగాలను చట్టబద్ధం చేయడంతో శాశ్వత ఉద్యోగ వ్యవస్థను దెబ్బతీస్తున్నారని పేర్కొంటున్నాయి. వలస కార్మికులు, స్కీమ్ వర్కర్స్ హక్కులకు కూడా ఈ కోడ్లలో తగిన రక్షణ లేదని సిఐటియు అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేసి, గతంలో కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను పునరుద్ధరించాలని సిఐటియు పార్లమెంట్ మార్చ్‌తో కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది.







కామెంట్‌లు (0)