బుధవారం, 25 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రిస్క్రిప్షన్ లేకుండానే మత్తు మందుల విక్రయాలు!

12 నవంబర్, 2026

medicine
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 12, 2026, 09:29 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- హేమంత్ మెడికల్ షాప్‌పై పోలీసుల మెరుపు దాడి

- నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తింపు..

- డ్రగ్ కంట్రోల్ అధికారుల తదుపరి చర్యలు

ప్రజాశక్తి - అనంతపురం: ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ, ప్రభుత్వ నిబంధనలకు తూట్లు పొడుస్తున్న మెడికల్ షాపులపై పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు. వైద్యుల చెల్లుబాటు అయ్యే ప్రిస్క్రిప్షన్ లేకుండానే మందుల విక్రయాలు సాగిస్తున్నారన్న సమాచారంతో అనంతపురం నగరంలోని రుద్రంపేట బైపాస్ వద్ద ఉన్న హేమంత్ మెడికల్ అండ్ ఫ్యాన్సీ షాప్‌పై బుధవారం ఆపరేషన్ గరుడ బృందం ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ, ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ పి. జగదీష్, ఐపీఎస్ సూచనలతో ఈగల్ టోల్‌ఫ్రీ నంబర్ 1972కు అందిన సమాచారం ఆధారంగా నాలుగో పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ తనిఖీలు చేపట్టారు.

ప్రిస్క్రిప్షన్ లేకుండానే విక్రయాలు!

తనిఖీల్లో కొన్ని మందులను వైద్యుల చెల్లుబాటు అయ్యే ప్రిస్క్రిప్షన్ లేకుండానే విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా అత్యంత నియంత్రణ అవసరమైన ఎన్‌ఆర్‌ఎక్స్ కేటగిరీ మందులను సైతం సరైన వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా విక్రయించినట్లు వెల్లడైంది. ఈ ఉల్లంఘనలపై డ్రగ్ కంట్రోల్ అధికారులు చట్టప్రకారం తదుపరి చర్యలకు సిద్ధమవుతున్నారు.

అక్రమ విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు

మెడికల్ షాపుల నిర్వాహకులు వ్యాపార లాభాల కోసం ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టవద్దని అధికారులు హెచ్చరించారు. వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా నియంత్రిత మందులు, మత్తు కలిగించే ఔషధాలను విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. నిబంధనలను ఉల్లంఘించే మెడికల్ షాపులపై ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయని హెచ్చరించారు. మత్తు మందుల అక్రమ విక్రయాలపై ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడైనా ఇలాంటి వ్యవహారాలు గుర్తిస్తే వెంటనే ఈగల్ టోల్‌ఫ్రీ నంబర్ 1972కు సమాచారం అందించాలని అధికారులు కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని తెలిపారు.ఈ తనిఖీల్లో నాలుగో పట్టణ సీఐ మస్తాన్, ఎస్‌ఐ షేక్షావలి, ఈగల్ టీమ్ ఎస్‌ఐ హనుమంతు, సిబ్బంది అమర్‌నాథ్ రెడ్డి, అలీ అక్బర్, నల్లపరెడ్డితో పాటు డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు కేశవరెడ్డి, మాధవి పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్