- కర్మకాండకు వెళ్తూ ఒకే కుటుంబంలో నలుగురు మృతి
- మొహరం వేడుకల నుంచి వస్తూ ముగ్గురు మృత్యువాత
ప్రజాశక్తి- మాచర్ల (పల్నాడు జిల్లా), పీలేరు (అన్నమయ్య జిల్లా) : పల్నాడు, అన్నమయ్య జిల్లాల్లో శుక్రవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు దుర్మరణం చెందారు. కర్మకాండల్లో పాల్గొనడానికి వెళ్తూ ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించగా, మొహరం వేడుకల నుంచి వస్తూ ముగ్గురు మృత్యువాత పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం... ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలోని నాగిరెడ్డిపల్లెకు చెందిన అడపా వెంకటేశ్వర్లు గురువారం మృతి చెందడంతో ఆయన ఖర్మకాండల్లో పాల్గొనేందుకు కుటుంబ సభ్యులు, బంధువులు హైదరాబాద్ నుంచి తుఫాను వాహనంలో వస్తున్నారు. పల్నాడు జిల్లా మాచర్ల పట్టణ శివారులోని శ్రీశైలం రహదారిపై అటవీ శాఖ నగరవనం వద్ద రోడ్డుపై ఆగి లారీని వారి వాహనం బలంగా ఢీకొంది. దీంతో, కదిరి వెంకటేశ్వర్లు (55), కదిరి శారద (47), పిడుగు సత్యనారాయణ (53), పోతంశెట్టి నాగలక్ష్మి (40) అక్కడికక్కడే మృతి చెందారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. అన్నమయ్య జిల్లా పీలేరు మండలం రేగళ్లు గ్రామానికి చెందిన కొందరు కలికిరి మండలం సొరకాయలపేట సమీపంలోని దూదేకులపల్లిలో జరిగిన మొహరం పండుగ వేడుకలకు ఆటోలో వెళ్లారు. సంబరాలను చూసి, మొక్కులు తీర్చుకుని తిరుగు ప్రయాణమయ్యారు. పీలేరు-కడప జాతీయ రహదారిలో పీలేరు మండలం ఠాణావడ్డిపల్లి సమీపంలో వారి ఆటోను కారు ఢీకొట్టింది. దీంతో, ఆటో డ్రైవర్ ముబారక్ (55), ఆటోలోని మెహరున్ బీ (70), నౌహీర్ (19) మృతి చెందారు. కారు డ్రైవర్ వెంకటరమణతో పాటు ఇర్ఫాని, ఆసిఫ్, వాహీద్, అఫ్జల్, సోహెల్ తీవ్రంగా గాయపడ్డారు.








కామెంట్‌లు (0)